విజయానికి 58 పరుగుల దూరంలో..
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది.
By - Medi Samrat |
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నాలుగో రోజు ఆటలో, ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌట్ అయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా, వెస్టిండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. విజయానికి చివరి రోజు మరో 58 పరుగులు మాత్రమే అవసరం కాగా, చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. సోమవారం ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ (25), సాయి సుదర్శన్ (30) క్రీజులో నిలకడగా ఆడుతున్నారు.
ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటై భారత్‌కు పోటీ ఇచ్చింది. విండీస్ బ్యాటర్లు జాన్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) శతకాలతో ఆకట్టుకున్నారు. భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లతో రాణించగా, జస్‌ప్రీత్ బుమ్రా 3, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, తొలి ఇన్నింగ్స్‌ను 518/5 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 248 పరుగులకే కుప్పకూలింది.