ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచింది. తాజాగా టీ20 ఫార్మాట్లో తొలిసారిగా విజేతగా నిలిచింది. 2019లో వన్డే వరల్డ్ కప్ లో ఓడిన న్యూజిలాండ్, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ ఓటమి పాలైంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టుకు రూ.11.89 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ గా నిలిచిన కివీస్ జట్టుకు రూ.5.9 కోట్లు దక్కాయి.
టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడంతో ఆసీస్ ఆటగాళ్లు సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆటగాళ్ల వింత వింత సెలెబ్రేషన్స్ మనకు కాస్త కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. ICC వరల్డ్ T20 2021లో ఆకట్టుకునే ప్రదర్శన తర్వాత ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి మొట్టమొదటి T20 ప్రపంచ కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆస్ట్రేలియా జట్టు సభ్యులు తమ తొలి T20 ప్రపంచ కప్ విజయాన్ని కొత్త శైలిలో జరుపుకున్నారు. షూలలో డ్రింక్స్ నింపుకుని వాటిని తాగుతూ ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. సెమీస్ హీరోలు మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్ షూ విప్పేసి అందులో డ్రింక్స్ నింపుకుని తాగుతూ ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది.