వన్డే ప్రపంచ కప్ లో అతడే టాప్ స్కోరర్ : సెహ్వాగ్

ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో టాప్ స్కోరర్ గా

By Medi Samrat  Published on  26 Aug 2023 11:34 AM GMT
వన్డే ప్రపంచ కప్ లో అతడే టాప్ స్కోరర్ : సెహ్వాగ్

ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో టాప్ స్కోరర్ గా నిలుస్తాడని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. భారత్‌లో బ్యాటింగ్‌కు అనుకూలమైన పరిస్థితుల కారణంగా వచ్చే వన్డే ప్రపంచకప్‌లో ఓపెనర్లు రాణించేందుకు అనేక అవకాశాలు ఉంటాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఐసీసీ Instagram ఖాతా లో పోస్ట్ చేసిన వీడియోలో.. సెహ్వాగ్ 2023 ప్రపంచ కప్‌లో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారో ఊహించమని అడిగారు. అతను రోహిత్‌ని సెలెక్ట్ చేశాడు. “భారత్‌లో మంచి పిచ్ లు ఉంటాయి, కాబట్టి ఓపెనర్లకు మంచి అవకాశాలు లభిస్తాయని నేను భావిస్తున్నాను. నేను ఒకరిని ఎంచుకోవాలనుకుంటే, రోహిత్ శర్మ అని చెబుతాను." అని అన్నాడు సెహ్వాగ్. రోహిత్ శర్మ కేవలం ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గానూ బరిలో దిగుతున్నాడు. వరల్డ్‌ కప్ అంటే చాలు అతడిలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. అద్భుతమైన ప్రదర్శనలతో చెలరేగుతాడు. ఈ సారి కూడా ఎక్కువ పరుగులు చేస్తాడని సెహ్వాగ్ అన్నాడు. బాగా ఆడే వాళ్లకు సంబంధించి.. కొందరు ప్లేయర్లు ఉన్నారు కానీ.. నేను ఇండియన్‌ను కాబట్టి.. ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మనే ఎంచుకుంటానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

2019 వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్‌లో జరిగింది. రోహిత్ ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేశాడు. తొమ్మిది గేమ్‌లలో, అతను 81 సగటుతో 648 పరుగులు చేశాడు, ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. 36 ఏళ్ల రోహిత్ మొత్తం 244 ODI మ్యాచ్‌లలో 48.69 సగటుతో 30 శతకాలు, 48 అర్ధ సెంచరీలతో 9837 పరుగులు చేశాడు.

Next Story