13 ఏళ్ల తర్వాత 'కోహ్లీ' రంజీ ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్.. ఆ జ‌ట్టులోనే ఆడనున్న‌ 'పంత్'..

విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. జనవరి 30న ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆడనున్న‌ట్లు విరాట్ ధృవీకరించాడు.

By Medi Samrat  Published on  21 Jan 2025 8:57 AM IST
13 ఏళ్ల తర్వాత కోహ్లీ రంజీ ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్.. ఆ జ‌ట్టులోనే ఆడనున్న‌ పంత్..

విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. జనవరి 30న ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆడనున్న‌ట్లు విరాట్ ధృవీకరించాడు. రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని డీడీసీఏ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీకి, టీమ్ మేనేజ్‌మెంట్‌కు విరాట్ చెప్పినట్లు ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ తెలిపారు. అయితే జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ ఆడడని పేర్కొన్నాడు.

విరాట్ తన చివరి రంజీ ట్రోఫీని 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో ఆడాడు. తాజాగా డీడీసీఏ 22 మంది సభ్యుల ప్రిలిమినరీ టీమ్‌లో విరాట్ పేరును కూడా చేర్చింది. విరాట్‌తో పాటు, రిషబ్ పంత్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడేందుకు పంత్ ఆమోదం తెలిపాడు.

మెడ బెణక‌డంతో కోహ్లీ జనవరి 23న రాజ్‌కోట్‌లో సౌరాష్ట్రతో జరగనున్న ఢిల్లీ మ్యాచ్‌కు దూరంగా ఉండ‌నున్నాడు. జట్టు చివరి రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉన్నట్లు డీడీసీఏకు తెలిపాడు. రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉన్నట్లు విరాట్ డీడీసీఏ ప్రెసిడెంట్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు ఢిల్లీ ప్రధాన కోచ్ శరణ్‌దీప్ సింగ్ పీటీఐకి తెలిపారు.

కోహ్లీ చివరిసారిగా నవంబర్ 2012లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. రిషబ్ పంత్ ఆరేళ్ల తర్వాత తొలి రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. రైల్వేస్ మ్యాచ్‌లో కోహ్లీతో పాటు పంత్‌ను కూడా చూడవచ్చు. శనివారం ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించిన తర్వాత.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన సొంత మైదానంలో జమ్మూ కాశ్మీర్‌తో జరిగే ముంబై మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నట్లు ధృవీకరించాడు. రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్‌లో శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజాలతో సహా ఇతర భారత స్టార్‌లు కూడా తమ తమ జట్లకు అందుబాటులో ఉండ‌నున్నారు.

విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012 నవంబర్ 2-5 తేదీలలో దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మధ్య జరిగింది. వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీలో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది.

Next Story