ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత ఓ మంచి మాట చెప్పిన విరాట్..!
ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తర్వాత భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు.
By Medi Samrat Published on 10 March 2025 8:42 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తర్వాత భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు. తన పని కేవలం ఐసిసి ట్రోఫీలు గెలవడమే కాదు.. ఆటకు వీడ్కోలు పలికినప్పుడు భారత క్రికెట్ మెరుగైన స్థితిలో ఉండేలా చూడడం కూడా అని చెప్పాడు. నిన్న దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను గెలుచుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత న్యూజిలాండ్ జట్టు 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా భారత జట్టు 49వ ఓవర్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది.
76 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2013 తర్వాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ బ్యాట్‌తో విఫలమైనా.. టోర్నీలో ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ పుకార్లపై కోహ్లి ఇలా అన్నాడు.
నేను విడ్కోలు పలికినప్పుడు.. జట్టును మెరుగైన స్థితిలో వదిలివేయాలనుకుంటున్నాను. వచ్చే ఎనిమిదేళ్లపాటు ప్రపంచంలోని ఏ జట్టునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న జట్టు మా వద్ద ఉందని నేను భావిస్తున్నాను. ఇది అద్భుతం. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత పుంజుకుని పెద్ద టోర్నీని గెలవాలనుకున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతం. శుభ్‌మన్ గిల్‌తో పాటు నిలబడిన కోహ్లి మాట్లాడుతూ.. జట్టు సీనియర్ ఆటగాడిగా.. నా దృష్టి తదుపరి తరాన్ని సిద్ధం చేయడంపై కూడా ఉందని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా ప్రతిభ ఉంది. వారు తమ ఆటను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. సీనియర్‌గా ఉన్నందున, మా అనుభవాన్ని వారితో పంచుకోవడం.. వారికి సహాయం చేయడం మాకు సంతోషంగా ఉంది.. అందుకే భారత జట్టు చాలా బలంగా ఉందన్నాడు.
జట్టు కృషి ఫలితంగానే టైటిల్ గెలుపు సాధ్యమైందని.. టీమ్ మొత్తం, అందరూ సహకరించారని చెప్పాడు. మేము గొప్ప జట్టులో భాగం.. మేము ప్రాక్టీస్ సెషన్‌లలో కష్టపడి పనిచేశాము. శుభమన్, శ్రేయాస్, కేఎల్, హార్దిక్ అందరూ అద్భుతంగా ఆడారని పేర్కొన్నాడు. జూనియర్లకు సాయం చేస్తానన్న కోహ్లీ మాటలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.