చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో కోహ్లీ..!
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ వడోదరలోని కోటంబిలోని బీసీఏ స్టేడియంలో జరగనుంది.
By - Medi Samrat |
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ వడోదరలోని కోటంబిలోని బీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జోడీ మరోసారి కనిపించనుంది. గతేడాది చివరి వరకు కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో 2 సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. దీని తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ (131, 77) బ్యాట్‌తో చెలరేగిపోయాడు. కొత్త ఏడాదిలోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని కోహ్లీ భావిస్తున్నాడు.
ఇదిలావుంటే.. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డేలోనే విరాట్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. అది కూడా సచిన్ టెండూల్కర్ రికార్డు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచేందుకు విరాట్ కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 33 ఇన్నింగ్స్‌ల్లో 55.23 సగటుతో 1,657 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌పై 41 ఇన్నింగ్స్‌లలో 46.05 సగటుతో 1,750 పరుగులు చేశాడు, ఇందులో ఐదు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్‌పై కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లో 52.59 సగటుతో 1157 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
సచిన్ టెండూల్కర్ - 1750 పరుగులు
విరాట్ కోహ్లీ - 1657 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్ - 1157 పరుగులు
మహ్మద్ అజారుద్దీన్ - 1118 పరుగులు
సౌరవ్ గంగూలీ - 1079 పరుగులు
విరాట్ కోహ్లీ తన అద్భుతమైన వన్డే కెరీర్‌లో మరికొన్ని రికార్డులు నెలకొల్పనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేసేందుకు కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే.. అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచేందుకు కుమార సంగక్కరకు 42 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లీ అన్ని ఫార్మాట్లలో 556 మ్యాచ్‌లలో 52.58 సగటుతో 27,975 పరుగులు చేశాడు. ఇందులో 84 సెంచరీలు, 145 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
సచిన్ టెండూల్కర్: 34357 పరుగులు
కుమార్ సంగక్కర: 28016 పరుగులు
విరాట్ కోహ్లీ: 27975 పరుగులు
రికీ పాంటింగ్: 27483 పరుగులు
సనత్ జయసూర్య: 25957 పరుగులు