ICC Rankings : నంబర్-1 కోసం 'RO-KO' మధ్య యుద్ధం..!

ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు.

By -  Medi Samrat
Published on : 10 Dec 2025 4:00 PM IST

ICC Rankings : నంబర్-1 కోసం RO-KO మధ్య యుద్ధం..!

ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ నంబర్-1 స్థానంలో ఉన్న తన సహచరుడు రోహిత్ శర్మ కంటే 8 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. 37 ఏళ్ల కింగ్ కోహ్లీ ఏప్రిల్ 2021 నుండి ICC ODI బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సాధించలేదు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అతడు మరోసారి ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోనున్నాడు.

వన్డే సిరీస్‌లో 302 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. వైజాగ్‌లో జ‌రిగిన చివ‌రి వ‌న్డేలో 65 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ ప్రదర్శన ICC ODI ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి ప్రయోజనం చేకూర్చింది. ఆ ఇన్నింగ్సు ద్వారా రెండు స్థానాలు ఎగబాకి రెండవ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీరిద్దరూ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ శర్మ 146 పరుగులు చేయగా, కింగ్ కోహ్లీ మొత్తం సిరీస్‌లో 302 పరుగులు చేశాడు.

ఈ ఇద్దరు దిగ్గజాలు న్యూజిలాండ్‌తో జనవరి 11 నుండి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 'హిట్‌మ్యాన్' ప్రస్తుతం 781 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 773 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో ప్రదర్శన ద్వారా రోహిత్, కోహ్లి మొదటి స్థానం తారుమారు అయ్యే అవ‌కాశం ఉంది.

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు చెందిన శ్రేయాస్ అయ్యర్ ఒక స్థానం కోల్పోయాడు. 10వ స్థానానికి పడిపోయాడు. టాప్-10లో న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ ఒక స్థానం కోల్పోగా, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్ కూడా ఒక స్థానం కోల్పోయాడు. ఇద్దరూ వరుసగా మూడు, నాలుగు స్థానాలకు దిగజారారు. శుభ్‌మన్ గిల్ ఐదో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన వెటరన్ బాబర్ ఆజం ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకోగా.. ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లలో కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు.

Next Story