వ‌న్డే జ‌ట్టులో లేకున్నా టీమ్‌తోనే ఉన్న‌ మిస్టరీ స్పిన్నర్.. చోటిచ్చి షాకిచ్చిన బీసీసీఐ..!

భారత జట్టు గురువారం నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడాల్సి ఉంది.

By Medi Samrat  Published on  4 Feb 2025 6:47 PM IST
వ‌న్డే జ‌ట్టులో లేకున్నా టీమ్‌తోనే ఉన్న‌ మిస్టరీ స్పిన్నర్.. చోటిచ్చి షాకిచ్చిన బీసీసీఐ..!

భారత జట్టు గురువారం నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా శిబిరంలో సందడి నెలకొంది. టీ20 సిరీస్‌లో సంచలనం సృష్టించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మంగళవారం టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

వరుణ్ చక్రవర్తి వన్డే జట్టులో లేడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. అటువంటి పరిస్థితితుల‌లో వరుణ్ నాగ్‌పూర్‌లో జట్టుతోనే ఉండటం ఆశ్చర్యకరమైన విష‌యం. సెలక్షన్ కమిటీ వరుణ్‌ను వన్డే జట్టులో చేర్చుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే.. నాగ్‌పూర్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో ఉంటాడా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతుంది. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కి వరుణ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయంటున్నారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కు గంభీర్‌ కోచ్‌గా ఉన్నాడు.. ఆ జ‌ట్టులోనే వరుణ్ కూడా ఆడాడు. అప్ప‌టినుంచి ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాలు ఉన్నాయి.

టీ20 సిరీస్‌లో వరుణ్‌ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో మొత్తం 14 వికెట్లు తీశాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ గురించి గంభీర్ చాలా సానుకూలంగా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో జట్టు ప్లేయింగ్-11లో వరుణ్ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి గంభీర్ వరుణ్‌ని సిద్ధం చేస్తున్నాడని, అందుకే అతడిని వన్డే జట్టులో ఉంచే అవకాశం కూడా ఉందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పిచ్‌లు నెమ్మదిగా ఉండే దుబాయ్‌లో భారత్ అన్ని మ్యాచ్‌లను ఆడుతుంది. వరుణ్ జట్టులోకి వస్తే రవీంద్ర జడేజా లేదా అక్షర్ పటేల్ తప్పించ‌డం ఖాయం. వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉన్నప్పటికీ, వరుణ్ లాగే గంభీర్‌కి ఫేవరెట్ కాబట్టి అతడ్ని డ్రాప్ చేయలేము. వరుణ్ రాకపై ఆ నింద పడితే అది జడేజా లేదా అక్షర్‌పై మాత్రమే పడుతుందని విశ్లేష‌ణ‌లు చెబుతున్నాయి.

Next Story