వారిని హైదరాబాద్ నుండి వెళ్లిపొమ్మని చెప్పడం మానవత్వం అనిపించుకోదు : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లాలని తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు కోరడం కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు

By Medi Samrat  Published on  7 Aug 2024 6:00 PM IST
వారిని హైదరాబాద్ నుండి వెళ్లిపొమ్మని చెప్పడం మానవత్వం అనిపించుకోదు : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లాలని తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు కోరడం కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఐక్యత ఒక్కటే మార్గమని.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ వదిలి వెళ్లాలని కోరడం ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు.

తెలంగాణకు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆంధ్రప్రదేశ్‌లోని తమ తోటి క్యాబ్ డ్రైవర్‌లను వెళ్లిపొమ్మని బెదిరిస్తే.. 2,000 కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతాయని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని జనసేన పార్టీ అధినేత అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఒక్కటేనన్న భావన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఉపముఖ్యమంత్రి అన్నారు.

“రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఐక్యత ఒక్కటే మనల్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనించాలని పదే పదే చెబుతున్నాను ఎందుకంటే ఇక్కడ అవకాశాలు పెరిగితే ఆంధ్రా నుంచి తెలంగాణకు వలసలు ఆగిపోతాయి. ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన క్యాబ్ డ్రైవర్లు.. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని, దీంతో అక్కడ నివసించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అధికారులు, క్యాబ్‌ డ్రైవర్లు తమను వేధిస్తున్నారని పవన్ కళ్యాణ్ కు క్యాబ్ డ్రైవర్లు ఫిర్యాదు చేశారు.

Next Story