సాకర్ ప్రపంచ కప్ కోసం ఖతార్ ముస్తాబవుతోంది. అయితే కార్మికులపై ఆంక్షలను విధిస్తూ వస్తోంది. ఫుట్ బాల్ అభిమానులు సందర్శించే దోహాలో విదేశీ కార్మికులను వారి అపార్ట్మెంట్ల నుండి ఖాళీ చేయిస్తున్నారు. దోహా మధ్యలో వేలాది మంది విదేశీ కార్మికులు నివాసం ఉంటుండగా.. అపార్ట్‌మెంట్ బ్లాకులను ఖతార్ అధికార యంత్రాంగం ఖాళీ చేసిందని.. వారి ఇళ్ల నుండి బయటకు పంపించేశారని కార్మికులు వాపోయారు. అధికారులు డజనుకు పైగా భవనాలు ఖాళీ చేయించడమే కాకుండా మూసివేయించారు. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికన్ కార్మికులను బలవంతం చేసి బయటకు పంపించేశారు. అయితే వాళ్లు ఉండడానికి ఎటువంటి సదుపాయాలను ఇవ్వలేదని తెలుస్తోంది.
నవంబర్ 20న ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభానికి నాలుగు వారాల ముందు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది విదేశీ కార్మికుల పట్ల ఖతార్ వ్యవహరిస్తున్న తీరు, అక్కడి చట్టాలపై అంతర్జాతీయంగా విమర్శలకు తావిస్తోంది. దోహాలోని అల్ మన్సౌరా జిల్లాలో 1,200 మంది నివాసితులు ఉన్నారని.. అధికారులు బుధవారం రాత్రి 8 గంటలకు వచ్చి ప్రజలను రెండు గంటల టైమ్ ఇస్తున్నాం.. వెళ్లిపోవాలని హెచ్చరించారు. మున్సిపల్ అధికారులు రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చి అందరినీ బలవంతంగా బయటకు పంపి తలుపులకు తాళాలు వేశారు.