ఐపీఎల్‌లో తమ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచిన ఐదుగురు ఆటగాళ్లు వీరే..!

IPL-2024 సీజ‌న్ ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి టైటిల్ గెలుచుకుంది.

By Medi Samrat  Published on  29 May 2024 3:45 PM GMT
ఐపీఎల్‌లో తమ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచిన ఐదుగురు ఆటగాళ్లు వీరే..!

IPL-2024 సీజ‌న్ ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి టైటిల్ గెలుచుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సీజన్‌లో జ‌ట్లు చాలా స్కోర్లు 200 స్కోరు న‌మోదుచేశాయి. ఈ సీజన్‌లో చాలా మంది యువ ఆటగాళ్లు మెప్పించగా.. కొందరు ఎవరూ ఊహించని ప్రదర్శనను కనబరిచారు. ఈ సీజన్‌లో తమ ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచిన అలాంటి కొంతమంది ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

అభిషేక్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్స్‌కు చేరినా టైటిల్ గెలవలేకపోయింది. ఈ సీజన్‌లో ఈ జట్టు చూపిన తుఫాను శైలిని మరే జ‌ట్టు చూపించలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఈ జట్టులోని ఓపెనింగ్ జోడీ. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీ తుఫాను సృష్టించింది. హెడ్ ​​గేమ్ గురించి అందరికి తెలిసిందే, అయితే అభిషేక్ దూకుడు చూపిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిషేక్ చాలా కాలంగా ఐపీఎల్ ఆడుతున్నాడు కానీ ఈ సీజన్‌లో లాగా ఎప్పుడు ఇలా బ్యాటింగ్ చేయలేదు. ఈ సీజన్‌లో అభిషేక్ 16 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో సహా 484 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 204.21గా ఉంది.

జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్

ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశం ఇచ్చింది. ఈ 22 ఏళ్ల ఆటగాడు చూపిన ఆటను ఎవరూ ఊహించలేదు. ఈ ఆటగాడు తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీల సాయంతో 330 పరుగులు చేశాడు. మెక్‌గర్క్ స్ట్రైక్ రేట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను 234.04 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు.

ట్రిస్టన్ స్టబ్స్

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన మరో యువ బ్యాట్స్‌మెన్ మెరిశాడు. ఈ బ్యాట్స్‌మెన్ పేరు ట్రిస్టన్ స్టబ్స్. ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఇంతకుముందు ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు, కానీ ఈ సీజన్‌లో అతను ఢిల్లీ తరపున ఆడాడు. ముంబై తరఫున రెండు సీజన్లు ఆడిన ట్రిస్టన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఢిల్లీతో అవకాశాలు పొంది 13 ఇన్నింగ్స్‌ల్లో 378 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 190.90 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.

యశ్ దయాళ్

గత సీజన్‌లో యశ్ దయాళ్ పేరు బాగా ప్రాచుర్యం పొందింది. రింకూ సింగ్ ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది కోల్‌కతా జట్టును గెలిపించడమే ఇందుకు కారణం. ఆ సమయంలో యష్ గుజరాత్ టైటాన్స్‌లో భాగంగా ఉన్నాడు. చివరి ఓవర్‌లో కొట్టిన ఈ సిక్సర్‌లు అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేశాయి. కానీ ఈ సీజన్‌లో యష్ మెరిశాడు. అతని అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో యష్ 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు.

హర్షిత్ రానా

కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా మారడానికి హర్షిత్ రానా ప్రధాన కారణం. రానా మిచెల్ స్టార్క్‌తో కలిసి బౌలింగ్ విభాగానికి నేతృత్వం వ‌హించాడు. చాలా మ్యాచ్‌ల్లో జట్టుకు తొలి వికెట్‌ను అందించాడు. ఈ రైట్ ఆర్మ్ బౌలర్ 11 ఇన్నింగ్స్‌ల్లో 19 వికెట్లు తీశాడు.

Next Story