టీ20ల్లో నంబర్ వన్ మనమే..

Team India becomes No.1 ranked side in T20Is. వెస్టిండీస్‌తో చివరి T20I గెలిచిన తర్వాత, టీమ్ ఇండియా టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ స్థానంలో నిలిచింది.

By Medi Samrat  Published on  21 Feb 2022 12:33 PM IST
టీ20ల్లో నంబర్ వన్ మనమే..

వెస్టిండీస్‌తో చివరి T20I గెలిచిన తర్వాత, టీమ్ ఇండియా టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ స్థానంలో నిలిచింది. ఈ విజయంతో భారత్ T20 టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. రోహిత్ శర్మ జట్టు ఇప్పుడు టాప్ రేటింగ్ పాయింట్స్ 269తో నిలిచింది. ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండూ ఒకే రేటింగ్ (269) కలిగి ఉండగా, భారతదేశం మొత్తం 10,484 పాయింట్లను కలిగి ఉంది, ఇంగ్లాండ్ (10,474) కంటే 10 ఎక్కువ ఉండడంతో భారత్ నంబర్ 1 గా నిలిచింది. పాకిస్తాన్ (రేటింగ్ 266), న్యూజిలాండ్ (255), దక్షిణాఫ్రికా (253) మూడు-నాలుగు-ఐదు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంకపై 4-1 సిరీస్ విజయం తర్వాత ఆస్ట్రేలియా (249) ఆరో స్థానంలో కొనసాగుతోంది. 6 సంవత్సరాల తర్వాత భారత్ టీ20ల్లో నంబర్ 1 స్థానాన్ని తిరిగి పొందింది. ఎంఎస్ ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో భారత్ టీ20ల్లో నంబర్ 1 గా నిలిచింది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడవ టీ20లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ గెలుచుకుంది. భారత జట్టు తొలుత 184 పరుగులు చేసింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్ మాత్రమే విండీస్ జట్టులో రాణించారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి టీ20ల్లో తన నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.


Next Story