ICC T20I Rankings : సూర్యకు షాక్.. నంబర్-1 ర్యాంకును కైవసం చేసుకున్న హెడ్
ఐసీసీ పురుషుల టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ట్రావిస్ హెడ్ నంబర్-1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2024 6:15 PM ISTఐసీసీ పురుషుల టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ట్రావిస్ హెడ్ నంబర్-1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు. డిసెంబర్ 2023 నుండి ICC పురుషుల T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్య అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే T20 ప్రపంచ కప్ లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ICC ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి మొదటి స్థానాన్ని సాధించాడు. ట్రావిస్ హెడ్ ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్‌లలో 42 సగటుతో 255 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో రెండో స్థానంలో ఉన్నాడు.
T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లకు ముందు ICC తాజా ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఇందులో సూర్యకుమార్ యాదవ్ నంబర్-1 ర్యాంక్‌ను కోల్పోయాడు. ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ సూర్య నుంచి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 30 ఏళ్ల ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 76 పరుగులు చేశాడు. హెడ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించలేకపోయినప్పటికీ.. మ్యాచ్‌లో తుఫాను ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ICC ర్యాంకింగ్స్‌లో అతడు భారీ బూస్ట్‌ను పొందాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ట్రావిస్ 4 స్థానాలు ఎగబాకి మొదటి స్థానంలో నిలిచాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌ల్లో 29 సగటుతో 149 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 33 ఏళ్ల సూర్య వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సూర్య ప్రస్తుతం 842 రేటింగ్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ మూడు స్థానాలు కోల్పోయాడు. మార్కస్ 211 రేటింగ్‌తో నాలుగో స్థానానికి పడిపోగా.. హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు ఎగబాకాడు. హార్దిక్ పాండ్యా 213 రేటింగ్‌తో మూడో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక జట్టు ఆల్‌రౌండర్ వనిందు హసరంగ 222 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. T20 ప్రపంచ కప్ లో మూడు ఇన్నింగ్స్‌లలో 6 వికెట్లు పడగొట్టడం ద్వారా హసరంగ మళ్లీ మొదటి స్థానాన్ని సాధించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా పునరాగమనం చేసి 44 స్థానాలు ఎగబాకాడు. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా 24వ స్థానానికి చేరుకున్నాడు.