కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) భారత మాజీ క్రికెటర్ ఎస్.శ్రీశాంత్‌ను రాష్ట్రంలోని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుండి మూడేళ్ల పాటు నిషేధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు నుండి సంజు శాంసన్ ను తొలగించడం, ఆ తర్వాత KCA నోటీసుకు ఆయన ఇచ్చిన సమాధానంపై టెలివిజన్ చర్చలో ఆయన చేసిన వ్యాఖ్యలు అవమానకరమైనవని, అనుచితమైనవని KCA పేర్కొంది. ఏప్రిల్ 30న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలకు శాంసన్ తండ్రి విశ్వనాథ్‌తో సహా మరికొంతమందికి కూడా KCA నోటీసులు పంపింది. శాంసన్ తండ్రి ప్రతిస్పందనతో ఎలా ముందుకు సాగాలనే దానిపై KCA ఆలోచిస్తోంది. భారత జట్టుకు శాంసన్ ఎంపిక కాకపోవడానికి అసోసియేషన్‌ను నిందించిన శ్రీశాంత్, ఆ తర్వాత ఇచ్చిన వివరణపై కేరళ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక శ్రీశాంత్ కేరళ క్రికెట్ లీగ్‌లోని కొల్లం ఏరీస్ ఫ్రాంచైజీకి సహ యజమాని. భారత మాజీ పేసర్ మూడేళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదని కేరళ క్రికెట్ అసోసియేషన్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. అయితే, అతను కేరళ క్రికెట్ అసోసియేషన్ లీగ్‌లో ఫ్రాంచైజీ సభ్యుడిగా కొనసాగవచ్చు.