14 నెలల సుదీర్ఘ విరామం.. జట్టులోకి తిరిగి వచ్చిన షమీ

ఇంగ్లండ్‌తో వైట్ బాల్ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆదివారం మూడు గంటల ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించింది.

By Medi Samrat  Published on  20 Jan 2025 7:45 AM IST
14 నెలల సుదీర్ఘ విరామం.. జట్టులోకి తిరిగి వచ్చిన షమీ

ఇంగ్లండ్‌తో వైట్ బాల్ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆదివారం మూడు గంటల ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించింది. ఈ సెష‌న్‌లో అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై పడింది. గాయం కారణంగా 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన షమీ.. గంటకు పైగా పూర్తి రిథమ్‌లో బౌలింగ్ చేశాడు. ఎడమ మోకాలికి బ్యాండేజీ ధరించిన షమీ.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో.. మొదట్లో షార్ట్ రన్-అప్‌తో నెమ్మదిగా బౌలింగ్ చేసి, ఆపై ఫుల్ రన్-అప్‌తో వేగాన్ని పెంచాడు.

సుమారు గంటపాటు బౌలింగ్ చేసిన తర్వాత ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నాడు. షమీ ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన‌గా.. అతను తన పేస్, ఖచ్చితమైన లైన్ అండ్‌ లెంగ్త్‌తో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టడం ద్వారా ఆందోళనలను తగ్గించాడు. అయితే.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ మాత్రం ష‌మీ బౌలింగ్‌లో కొన్ని దూకుడు షాట్లు చేశాడు. బౌలింగ్ ప్రాక్టీస్ ముగించిన తర్వాత.. ష‌మీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో మాట్లాడాడు.

ఫిబ్రవరి 19న దుబాయ్, పాకిస్థాన్‌లో ప్రారంభం కానున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భార‌త‌ జట్టు తన పేస్ అటాక్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తున్నందున.. షమీని T20 జట్టులో చేర్చుకోవడం కీల‌క‌మైన ప‌రిణామం. జస్ప్రీత్ బుమ్రా గాయానికి సంబంధించి పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. కాబట్టి షమీ ఫిట్‌నెస్ టీమ్‌కు ముఖ్యం. దేశవాళీ క్రికెట్‌లో స‌త్తా చాటిన‌ తర్వాత షమీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతను రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీ తర్వాత విజయ్ హజారే ODI ట్రోఫీలో కూడా పాల్గొన్నాడు. అయితే.. ఒకసారి ప్రాక్టీస్ సెషన్‌లో షమీ కుంటుతూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు.. కానీ కొద్దిసేపటికే తిరిగి వచ్చి పూర్తి శక్తితో బౌలింగ్ చేశాడు.

ఈ ప్రాక్టీస్ సెషన్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పాల్గొనలేదు. అర్ష్‌దీప్‌ మినహా మొత్తం టీమ్‌ ఇక్కడ ఉంది' అని భారత జట్టు అధికారి ఒకరు తెలిపారు. జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఆదివారం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. సోమవారం జరిగే తొలి ప్రాక్టీస్ సెషన్‌లో జట్టు పాల్గొననుంది.

Next Story