నన్ను అఫ్రిదీ మతం మారమన్నాడు.. నాతో డిన్నర్‌ చేయలేదు.. చాలా వేధించారు

పాకిస్థాన్‌కు చెందిన హిందూ క్రికెటర్ డానిష్ కనేరియా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో షాహిద్ అఫ్రిదీ మతం మారాలని చాలాసార్లు అడిగాడని చెప్పాడు

By Medi Samrat  Published on  13 March 2025 3:17 PM IST
నన్ను అఫ్రిదీ మతం మారమన్నాడు.. నాతో డిన్నర్‌ చేయలేదు.. చాలా వేధించారు

పాకిస్థాన్‌కు చెందిన హిందూ క్రికెటర్ డానిష్ కనేరియా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో షాహిద్ అఫ్రిదీ మతం మారాలని చాలాసార్లు అడిగాడని చెప్పాడు. మాజీ లెగ్ స్పిన్నర్ కనేరియా వాషింగ్టన్ DCలో జరిగిన కాంగ్రెస్ బ్రీఫింగ్‌లో పాకిస్తాన్‌లోని మైనారిటీల దుస్థితిపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశాడు.

2000-2010 మధ్య పాకిస్తాన్ తరపున 61 టెస్టులు ఆడిన కనేరియా.. అనిల్ దల్పత్ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రెండవ హిందూ క్రికెటర్. దేశంలో గౌరవం దక్కకపోవడంతో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా తెలిపాడు.

పాకిస్తాన్‌లో మా ప‌ట్ల‌ ఎలా ప్రవర్తించారనే దాని గురించి మా అనుభవాన్ని పంచుకోవడానికి మేమంతా ఇక్కడ సమావేశమయ్యాము.. మేము వివక్షను ఎదుర్కొన్నాము.. నేడు మేము దానికి వ్యతిరేకంగా మా గొంతును వినిపిస్తున్నామన్నారు.

నేను చాలా వివక్షను ఎదుర్కొన్నాను. నా కెరీర్ నాశనమైంది. పాకిస్థాన్‌లో నాకు దక్కాల్సిన మద్దతు, గౌరవం లభించలేదు. ఈ వివక్ష కారణంగానే నేను ఈరోజు అమెరికాలో ఉన్నాను. మేము అవగాహన కోసం మా గొంతును పెంచుతున్నాము.. మేము ఎంత బాధపడ్డామో అమెరికా తెలుసుకోవాలి.. తద్వారా చర్య తీసుకోవచ్చని పేర్కొన్నాడు.

2023లో ఆజ్ తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా.. షాహిద్ అఫ్రిదీ మతం మారాలని తనను చాలాసార్లు కోరినట్లు కనేరియా వెల్లడించాడు.

నేను నా కెరీర్‌లో బాగా రాణిస్తున్నాను.. కౌంటీ క్రికెట్ కూడా ఆడుతున్నాను.. ఇంజమామ్ ఉల్ హక్ నాకు చాలా మద్దతు ఇచ్చాడు.. అతను నాకు మద్దతు ఇచ్చిన ఏకైక కెప్టెన్. అతను కాకుండా షోయబ్ అక్తర్ నాకు మద్దతుగా నిలిచాడు. షాహిద్ అఫ్రిది, చాలా మంది ఇతర పాకిస్తానీ క్రికెటర్లు నన్ను మతం మారమని అడిగారు. నన్ను చాలా వేధించారు. చాలా మంది పాకిస్థానీ ఆటగాళ్లు నాతో డిన్నర్‌ చేయలేదు. షాహిద్ అఫ్రిది నన్ను మతం మారమని అడిగాడు. అతను చాలాసార్లు అడిగాడు. ఇంజమామ్ ఉల్ హక్ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని పేర్కొన్నాడు.

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ECB (ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు) గుర్తించినందున 2012లో డానిష్ కనేరియాపై జీవితకాల నిషేధం విధించబడింది. డానిష్ కనేరియా పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.. 61 టెస్టుల్లో 3.07 ఎకానమీతో 261 వికెట్లు తీశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో 15 సార్లు ఐదు వికెట్లు తీశాడు

Next Story