సెలెక్ట‌ర్లు క‌రుణించేనా..? ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై కూడా సెంచ‌రీతో చెల‌రేగిన సర్ఫరాజ్..!

ప్రిటోరియాలో జరుగుతున్న మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.

By Medi Samrat  Published on  23 Dec 2023 9:17 AM GMT
సెలెక్ట‌ర్లు క‌రుణించేనా..? ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై కూడా సెంచ‌రీతో చెల‌రేగిన సర్ఫరాజ్..!

ప్రిటోరియాలో జరుగుతున్న మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. సీనియర్ భారత జట్టు, ఇండియా-ఎ జట్లు రెండూ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతోంది. అంత‌కుముందు ఇండియా ఇంట‌ర్ స్క్వాడ్ మ్యాచ్ ఆడుతోంది.

T20, ODI సిరీస్‌ల‌ తర్వాత భారత జట్టు టెస్ట్ మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధ‌మైంది. టెస్ట్ స్క్వాడ్‌లో సగానికి పైగా ఆటగాళ్లు చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి వస్తున్నారు. అటువంటి పరిస్థితితుల‌లో ఆటగాళ్ల ప్రాక్టీస్ నిమిత్తం టీమిండియా సీనియ‌ర్ జ‌ట్టు, ఇండియా-ఏ ఆట‌గాళ్ల మ‌ధ్య‌ మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించింది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీ సాధించాడు. ఇండియా-ఎ తరపున సర్ఫరాజ్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ప్రిటోరియా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విద్వాత్ కావరప్ప, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా వంటి బౌల‌ర్ల‌ను ఎదుర్కొని సర్ఫరాజ్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. సర్ఫరాజ్ ఇన్నింగ్స్ వీడియోను అతని తమ్ముడు ముషీర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియోలో సర్ఫరాజ్ ఫోర్లు, సిక్సర్లు కొట్టడం కనిపించింది. అభిమన్యు ఈశ్వరన్ కూడా అతనితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈశ్వరన్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు.

దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా మంచి బ్యాట్స్‌మెన్‌గా స్థిరపడినప్పటికీ.. సర్ఫరాజ్‌కు చాలా కాలంగా భారత జట్టులో చోటు దక్కలేదు. ఇందుకు సంబంధించి సర్ఫరాజ్‌ ప‌లుమార్లు సెల‌క్ట‌ర్ల‌పై కూడా త‌న అస‌హ‌నాన్ని కూడా వెళ్ల‌గ‌క్కాడు. ఈ క్ర‌మంలో విదేశీ గ‌డ్డ‌పై చెల‌రేగ‌డం ద్వారా సెల‌క్ట‌ర్ల‌కు న‌న్ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌నే హెచ్చ‌రిక‌లు సెల‌క్ట‌ర్ల‌కు పంపాడు. సర్ఫరాజ్‌ 2022–23 రంజీ సీజ‌న్‌లో మూడు సెంచరీలతో.. 92.66 సగటుతో ఆరు మ్యాచ్‌ల్లో 556 పరుగులు చేశాడు. 2021-22 రంజీ ట్రోఫీ సీజన్‌లో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు.

Next Story