అబుదాబిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సర్ఫరాజ్ ఖాన్ రూ.75 లక్షలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టును దక్కించుకోవడం విశేషం. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 2023 సీజన్ తర్వాత తొలిసారిగా ఐపీఎల్‌లోకి తిరిగి వచ్చాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో సర్ఫరాజ్ మొదటి రౌండ్‌లో అమ్ముడుపోలేదు, దీంతో వరుసగా మూడో సంవత్సరం కూడా అతన్ని ఎవరూ కొనుక్కోకపోవచ్చనే అనుమానాలు తలెత్తాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అతడి బేస్ ధర రూ.75 లక్షలకు తీసుకుంది. ఎట్టకేలకు సర్ఫరాజ్ మెరుపులను ఐపీఎల్ లో చూడబోతున్నాం.
పూణేలో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున సర్ఫరాజ్ సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడిన కొన్ని గంటల తర్వాత వేలంలో అమ్ముడు పోయాడు. ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ 15 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మైదానంలోకి దిగి పుష్-అప్‌లు చేశాడు. చివరికి సర్ఫరాజ్ 22 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై విజయాన్ని అందుకుంది.