అభిషేక్ శర్మకు చుక్క‌లు చూపించిన సర్ఫరాజ్ ఖాన్..!

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో అభిషేక్ శర్మ సారథ్యంలోని పంజాబ్ జట్టుతో ముంబై తలపడింది.

By -  Medi Samrat
Published on : 8 Jan 2026 3:55 PM IST

అభిషేక్ శర్మకు చుక్క‌లు చూపించిన సర్ఫరాజ్ ఖాన్..!

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో అభిషేక్ శర్మ సారథ్యంలోని పంజాబ్ జట్టుతో ముంబై తలపడింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్, కెప్టెన్ అభిషేక్ శర్మ ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. దీంతో జట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 216 పరుగులకే పరిమితమైంది.

బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన‌ అభిషేక్ శర్మ బౌలింగ్ చేసి జ‌ట్టును గ‌ట్టెక్కిద్దామ‌నుకున్నాడు. అయితే ముంబై ఆట‌గాడు సర్ఫరాజ్ ఖాన్ ఒకే ఓవర్‌లో 30 పరుగులు బాదాడు. త‌ద్వారా కేవలం 15 బంతుల్లో టోర్నమెంట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 20 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 62 పరుగులు చేశాడు.

సర్ఫరాజ్ ఖాన్ విరుచుకుప‌డ్డా ముంబై చివరికి మూడు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. జైపూర్ గడ్డపై తొలుత బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ జట్టుకు మంచి ఆరంభం ద‌క్క‌లేదు. కెప్టెన్ అభిషేక్ శర్మ 10 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తొమ్మిది బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయగా.. హర్నూర్ సింగ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. 25 పరుగులకే మూడు వికెట్లు పతనమైన తర్వాత.. అన్మోల్‌ప్రీత్ సింగ్ 75 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 57 పరుగులు చేశాడు. రమణదీప్ సింగ్ 74 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు 45.1 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటైంది. ముంబై తరఫున ముషీర్ ఖాన్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు.

217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు ఓపెన‌ర్లు కూడా విఫ‌ల‌మ‌య్యారు. మూడో నంబర్‌లో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా అతనికి బాగా మద్దతు ఇచ్చాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన అభిషేక్ శర్మ ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్ మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో అతడు 15 బంతుల్లో విజయ్ హజారే ట్రోఫీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని సాధించాడు. ఇది లిస్ట్-ఎ క్రికెట్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన వేగవంతమైన అర్ధ సెంచరీగా న‌మోద‌య్యింది.

సర్ఫరాజ్ ఖాన్ 20 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 62 పరుగులు చేశాడు. అతనితో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. దీంతో అంతా ముంబై విజయం దాదాపు ఖాయం అనుకున్నారు. అయితే విజయానికి అతి చేరువగా వచ్చిన ముంబై జట్టు తడబడింది. ముంబై విజయానికి ఐదు పరుగులు మాత్రమే కావాల్సిన సమయంలో హర్నూర్ సింగ్ 25వ ఓవర్లో హార్దిక్ తమోర్‌ను అవుట్ చేయగా, హర్‌ప్రీత్ బ్రార్ తర్వాతి ఓవర్‌లో సాయిరాజ్ పాటిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ముంబై 214 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత 27వ ఓవర్లో మయాంక్ మార్కండే రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి ముంబైని 215 పరుగులకు ప‌రియితం చేశాడు. దీంతో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది

Next Story