మ్యాచ్ అక్క‌డే మా చేజారిపోయింది : సంజూ శాంసన్

ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం మూడో స్థానంతో ముగిసింది.

By Medi Samrat  Published on  25 May 2024 7:23 AM IST
మ్యాచ్ అక్క‌డే మా చేజారిపోయింది : సంజూ శాంసన్

ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం మూడో స్థానంతో ముగిసింది. ఓటమి అనంతరం కెప్టెన్ సంజూ శాంసన్ బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. అలాగే జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సంజూ శాంసన్ మాట్లాడుతూ.. తొలి ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన చేశాం. మా బౌలర్ల ప్రదర్శన ప్రశంసనీయం. రెండో ఇన్నింగ్స్‌లో మిడిల్ ఓవర్లలో మేం సరిగా ఆడకపోవడంతో మ్యాచ్ మా చేతుల్లో లేకుండా పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ మారిపోయింది. మంచు లేకపోవడంతో ఇలా జరిగింది.

పిచ్‌లో చాలా స్పిన్ ఉంది. అలాగే హైద‌రాబాద్‌ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. గత రెండు-మూడేళ్లలో కొంతమంది మంచి యువ ఆటగాళ్లు మా జట్టులోకి వచ్చారు. ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ ఆట‌ చాలా బాగుంది. వీరు మా జట్టుకే కాదు.. భారత జట్టుకు కూడా మంచి క్రికెట్ ఆడగలరని కితాబిచ్చాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫైనల్ చేరాలంటే రాజస్థాన్ 176 పరుగులు చేయాల్సి ఉంది. దీనికి సమాధానంగా రాజస్థాన్ 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. జైస్వాల్ 42 పరుగులు చేసి అవుట‌వ‌గా.. ధ్రువ్ జురెల్ 56 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.

Next Story