గిల్‌ను జట్టులోకి ఎంపిక చేయడంపై భారత వెటరన్ పరోక్ష విమర్శలు
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఇటీవల సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
By Medi Samrat
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఇటీవల సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్‌కు చోటు దక్కలేదు. మరోవైపు బీసీసీఐ సీనియర్ పురుషుల జట్టు సెలక్షన్ కమిటీపై భారత మాజీ బ్యాట్స్‌మెన్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించారు. భారత ఆసియా కప్ T20I జట్టులో క్రికెట్ లాజిక్ లేదని, టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లను విస్మరించారని ఆయన అన్నారు.
మంజ్రేకర్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఈ "ఫార్మాట్ మిక్సింగ్" ట్రెండ్‌ని గమనించాను. టెస్టుల్లో అద్భుతంగా ఆడిన ఆటగాడికి టీ20 జట్టులో చోటు దక్కడం చూస్తుంటే.. అందులో క్రికెట్ లాజిక్ లేదని అనుకుంటున్నా.. అర్థం కావడం లేదని అన్నాడు. మంజ్రేకర్ ఏ ఆటగాడి పేరును తన నోటితో చెప్పనప్పటికీ.. అతని వ్యాఖ్యలు శుభమాన్ గిల్‌పై చేశాడని స్పష్టంగా అనిపిస్తుంది. ఇటీవలే గిల్‌ను టీ20కి వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన టెస్ట్ సిరీస్‌లో గిల్ అద్భుత ప్రదర్శన చేసి 700కు పైగా పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను కూడా స్టాండ్‌బై జాబితా నుంచి తప్పించారు.
మంజ్రేకర్ మాట్లాడుతూ, “ఇంతకుముందు దేశవాళీ క్రికెట్‌లో తగినంత సహకారం అందించనందుకు జట్టు నుండి తప్పించబడిన ఆటగాడు, పూర్తి ఉత్సాహంతో తిరిగి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆపై ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. ఐపీఎల్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాడు. సెలక్టర్లు అయ్యర్‌ను జట్టు నుంచి తప్పించాలనుకుంటే.. టీ20లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాడిని మాత్రమే ఎంపిక చేసి ఉండాల్సిందని మంజ్రేకర్ అన్నాడు. టెస్టు క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాడిని కాకుండా టీ20 క్రికెట్‌లో బాగా ఆడిన ఆటగాడిని ఎంచుకోండని సూచించారు.