క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర స్మైల్ అంబాసిడర్‌గా నియమితుడయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్చ్ ముఖ్ అభియాన్ స్కీమ్‌లో భాగంగా సచిన్‌ను అంబాసిడర్‌గా నియమించారు. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా స్వచ్చ ముఖ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. క్లీన్ మౌత్ కాంపేయిన్ కోసం సచిన్ అయిదేళ్ల పాటు స్మైల్ అంబాసిడర్‌గా ఉండనున్నారు. రాష్ట్రంలో నోటి సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని, దీన్ని అరికట్టేందుకు ఈ కాంపేయిన్ చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ.. గతంలో పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయాలంటూ తనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని, కానీ తాను ఎన్నడూ వాటిని ఒప్పుకోలేదని, తిరస్కరించానని అన్నారు. స్కూల్ చదువులు పూర్తి కాగానే నేను టీమిండియాకు ఆడటం మొదలుపెట్టాను. ఎన్నో ప్రకటనల ఆఫర్లు వచ్చేవి. కానీ పొగాకు ఉత్పత్తుల యాడ్స్ కు మాత్రం ఒప్పుకోవద్దని మా నాన్న చెప్పేవారు. అలాంటి ఆఫర్లు ఎన్నో వచ్చేవి. కానీ నేను అంగీకరించలేదని సచిన్ అన్నారు. నోరు ఆరోగ్యంగా ఉంటే.. శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని సచిన్ చెప్పాడు. ఫిట్ నెస్ చాలా ముఖ్యమని, లక్ష్యాలను అందుకోవడంలో సాయపడుతుందని తెలిపారు. ఫిట్‌గా ఉండటం అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని, అయితే అది మీ లుక్స్‌కి సంబంధించినది మాత్రమే కాదని, మానసిక దృఢత్వం, నోటి పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని అన్నారు.