ఇలా రెచ్చిపోతే బౌల‌ర్ల ప‌రిస్థితేంటి..?

ఐపీఎల్ 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడింది.

By Medi Samrat  Published on  16 April 2024 10:36 AM IST
ఇలా రెచ్చిపోతే బౌల‌ర్ల ప‌రిస్థితేంటి..?

ఐపీఎల్ 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడింది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఆర్‌సిబి హోమ్ గ్రౌండ్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది.స‌మాధానంగా RCB విజయాన్ని నమోదు చేయడానికి తమ వంతు ప్రయత్నం చేసింది.. కానీ చివరికి ఆ జట్టు 25 పరుగుల తేడాతో వెనుదిరిగి మరో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, దినేష్ కార్తీక్ అద్భుత ఇన్నింగ్స్‌లు న‌మోదు చేసినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై RCB జట్టు విజయాన్ని నమోదు చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ట్రావిస్ హెడ్ సెంచరీ, హెన్రిచ్ క్లాసెన్ హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు. అనంత‌రం RCB కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కానీ లక్ష్యం చాలా పెద్దది. ఆర్సీబీ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 262 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆ జట్టు 25 పరుగుల తేడాతో ఓడింది. కార్తీక్ 35 బంతుల్లో 83 పరుగులతో సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడి RCBకి విజయాన్ని అందించడానికి ప్రయత్నించాడు. కానీ అత‌ని ప్ర‌య‌త్నం విఫ‌ల‌మ‌య్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కెప్టెన్ పాట్ కమిన్స్ 43 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మొత్తం 549 పరుగులు చేశాయి. వ‌న్డే మ్యాచ్ త‌ర‌హాలో స్కోర్లు న‌మోద‌వ‌డంతో.. బౌల‌ర్లు ఒక్కొక్క‌రు 50కి పైగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. ఇలానే జ‌రిగిదే బౌల‌ర్లు ఐపీఎల్‌తో అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకోవ‌డం ఖాయం.

ఈ సీజన్‌లో ఆర్‌సిబి అంతగా రాణించకపోవడంతో ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలవగలిగింది. ఆర్‌సీబీకి ఇది వరుసగా ఐదో ఓటమి కాగా పాయింట్ల పట్టికలో దిగువన 10వ స్థానంలో కొనసాగుతోంది.ఈ అద్భుత విజయంతో హైదరాబాద్ జట్టు ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించగా.. రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

Next Story