రోహిత్ భారీ సిక్సర్.. బంతి తగిలి నొప్పితో విలవిలలాడిన చిన్నారి.. వీడియో
Rohit Sharma's pull shot for 6 hits young girl in the crowd.ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్
By తోట వంశీ కుమార్ Published on 13 July 2022 7:01 AM GMTఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో సిక్సర్లతో అభిమానులను అలరించాడు. అయితే.. రోహిత్ కొట్టిన ఓ సిక్సర్ బంతి తగిలి ఓ చిన్నారి నొప్పితో విలవిలలాడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో డేవిడ్ విల్లే వేసిన బంతిని పుల్ షాట్‌తో రోహిత్ శర్మ భారీ సిక్సర్‌గా మలిచాడు. అయితే.. ఆ బంతి మ్యాచ్ చూడడానికి తన తండ్రితో వచ్చిన ఓ చిన్నారికి డైరెక్టుగా తగిలింది. దీంతో ఆ చిన్నారి నొప్పితో విలవిలలాడింది. ఈ విషయాన్ని బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న బెన్‌స్టోక్స్ తన సహచరులకు చెప్పగా వారు రోహిత్‌కు జరిగినది చెప్పారు.
దీంతో రోహిత్ తో పాట కామేంటేటర్లు చిన్నారి గురించి ఆరా తీసే క్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. ఇంగ్లాండ్ ఫిజియోలు ఆ చిన్నారికి ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈఘటనకు సంబంధించిన వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
#RohitSharma SIX hits girl in the stand pic.twitter.com/mSm17wyHFK
— Soni Gupta (@SoniGup46462554) July 12, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా (6/19) సంచలన బౌలింగ్‌కు మహ్మద్ షమీ (3/31) మెరుపులు కూడా తోడు అయ్యాయి. కెప్టెన్ జోస్ బట్లర్ (30; 32 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో 7పోర్లు, 5సిక్సర్లు)తో పాటు మరో ఓపెనర్ ధావన్ (31 నాటౌట్; 54 బంతుల్లో 4పోర్లు) రాణించారు.