న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు ఆందోళనలో రోహిత్
భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 15 Oct 2024 2:24 PM ISTభారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మకు భయం పట్టుకుంది. రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్నాడు. ఈ విషయాన్ని రోహిత్ స్వయంగా వెల్లడించాడు. మంగళవారం విలేకరుల సమావేశంలో రోహిత్ తన భయాన్ని వ్యక్తం చేశాడు. భారత్, న్యూజిలాండ్‌లకు ఈ సిరీస్ చాలా కీలకం. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో విజయం సాధించింది. కాగా.. ఇటీవల శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ప్లేయింగ్-11 గురించి విలేకరుల సమావేశంలో రోహిత్‌ను ప్రశ్నించగా.. బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు ఉన్నందున చివరి క్షణంలో మాత్రమే నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఈ కారణంగా రోహిత్ ఏ కాంబినేషన్ తో రంగంలోకి దిగాలనేది తేల్చుకోలేకపోతున్నాడు. కచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతానని రోహిత్ స్పష్టం చేశాడు. ప్లేయింగ్-11 ఎంపిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, ఈ రోజు ఇక్కడ వర్షం కురుస్తోంది, పిచ్‌పై కవర్లు ఉన్నాయి, మేము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో వెళ్లాలా లేదా ఇద్దరితో వెళ్లాలా అని రేపు ఉదయం నిర్ణయిస్తాము అని రోహిత్ చెప్పాడు. బంగ్లాదేశ్‌ను భారత్ అద్భుతంగా ఓడించింది. అదే ఫామ్‌ను కొనసాగించాలని టీం ఇండియా కోరుకుంటోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టు మ్యాచ్‌లో భారత్ టీ20లా బ్యాటింగ్ చేసింది. తమ జట్టు కేవలం ఒకే విధానంతో ఆడాలని కోరుకోవడం లేదని.. పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని కోరుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. ఆ రోజు ఎలా ఉంటుందో చూద్దాం.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం.. ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఏమి జరుగుతుందో చూస్తాము.. ఆపై మేము మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు.