ర‌ప్ఫాడించిన రోహిత్‌.. సిరీస్ స‌మం.. హైద‌రాబాద్‌లో అమీతుమీ

Rohit Sharma shines as India beat Australia by 6 wickets.భార‌త్‌-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న టీ20 సిరీస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2022 2:29 AM GMT
ర‌ప్ఫాడించిన రోహిత్‌.. సిరీస్ స‌మం.. హైద‌రాబాద్‌లో అమీతుమీ

భార‌త్‌-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ర‌స‌వ‌త్త‌ర ముగింపు ముంగిట నిలిచింది. తొలి టీ20లో ఓట‌మి పాలైన టీమ్ఇండియా రెండో టీ20లో పుంజుకుంది. మైదానంలోని ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా ఉండటంతో ఆట రెండున్న‌ర గంట‌ల ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. 20 ఓవ‌ర్ల మ్యాచ్‌ను కాస్త 8 ఓవ‌ర్ల‌కు కుదించారు. అయితేనేం.. మ్యాచ్‌లో మ‌లుపులు త‌క్కువ కాదు.. ఉత్కంఠకు లోటేం లేదు. పేల‌వంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ గొప్ప‌గా ముగించి టీమ్ఇండియాకు స‌వాల్ విసిరితే.. అదిరే ఆరంభం త‌రువాత కాస్త త‌డ‌బాటుకు గురైనా చివ‌ర్లో పుంజుకుని భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో స‌మ‌మైంది. ఇక సిరీస్ ఫ‌లితం ఉప్ప‌ల్ మైదానంలోనే తేల‌నుంది. ఆదివారం ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు న‌ష్ట‌పోయి 90 ప‌రుగులు చేసింది. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ( 31; 15 బంతుల్లో4 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఆరంభంలో ధాటిగా ఆడగా.. ఆఖ‌ర్లో మాథ్యూ వేడ్‌ ( 43 నాటౌట్‌; 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించ‌డంతో ఆసీస్ మెరుగైన స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు తీయ‌గా తిరిగి జట్టులోకి వచ్చిన ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (1/23) తన యార్కర్లతో ఆకట్టుకున్నాడు.

అనంతరం ల‌క్ష్యాన్ని భారత్‌ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ (46 నాటౌట్‌; 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు. రోహిత్ మెరుపు ఆరంభాన్ని అందిస్తే.. ఆసీస్ స్పిన్న‌ర్ జంపా (3/16) స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఓపెన‌ర్ రాహుల్‌(10), కోహ్లీ(11), సూర్య‌కుమార్ యాద‌వ్‌(0)ల‌ను ఔట్ చేసి భార‌త్‌ను ఒత్తిడిలో నెట్టేశాడు. ఆదుకుంటాడు అనుకున్న హార్థిక్ (9) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేదు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా మ‌రో ఎండ్‌లో రోహిత్ మాత్రం త‌న‌దైన శైలిలో బౌండ‌రీలు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 9 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఫినిష‌ర్‌గా జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న కార్తిక్‌(10 నాటౌట్; 2 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌) వ‌రుస‌గా 6,4 కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఇక సిరీస్ నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్ మ‌న హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్‌లో జ‌రుగుతుండ‌డం హైద‌రాబాదీయుల‌కు పండ‌గే.

Next Story