రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు

Rohit Sharma ready to create a World record.వెస్టిండీస్ జ‌ట్టును వైట్‌వాట్ చేసిన టీమ్ఇండియా అదే ఊపులో శ్రీలంక‌తో టీ20

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2022 3:32 PM IST
రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు

వెస్టిండీస్ జ‌ట్టును వైట్‌వాట్ చేసిన టీమ్ఇండియా అదే ఊపులో శ్రీలంక‌తో టీ20 సిరీస్‌కు సిద్ద‌మైంది. ల‌క్నో వేదిక‌గా నేడు భార‌త్‌, శ్రీలంక మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. టీమ్ఇండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ప‌లు రికార్డుల‌కు అత్యంత చేరువ‌లో ఉన్నాడు. నేడు జ‌రిగే మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 37 ప‌రుగులు చేస్తే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ 3,263 ప‌రుగుల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. 3,209 ప‌రుగుల‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గుప్టిల్ తొలి స్థానంలో ఉండ‌గా.. 3,296 టీమ్ఇండియా మాజీ కెప్టెన్ 3,296 ప‌రుగుల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

మూడు మ్యాచ్‌లు ఆడితే..

రోహిత్ శ‌ర్మ మ‌రో మూడు మ్యాచ్‌లు ఆడితే అంత‌ర్జాతీయ టీ20లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెట‌ర్‌గా నిల‌వ‌నున్నాడు. ప్ర‌స్తుతం రోహిత్ ఈ ఫార్మాట్‌లో 122 మ్యాచుల‌తో రెండో స్థానంలో ఉండ‌గా.. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ షోయ‌బ్ మాలిక్ 124 మ్యాచుల‌తో తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంది ఆట‌గాళ్లు మాత్ర‌మే 100కు పైగా టీ20 మ్యాచులు ఆడారు. భార‌త్ నుంచి రోహిత్ మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌కు పైగా టీ20 ఆడిన ఆట‌గాడు కావ‌డం గ‌మ‌నార్హం. మాజీ కెప్టెన్లు మ‌హేంద్ర‌సింగ్ ధోని (98), విరాట్ కోహ్లీ(97)ల‌తో త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. శ్రీలంక‌తో సిరీస్‌కు విరాట్‌, పంత్‌ల‌కు విశ్రాంతి ఇవ్వ‌గా.. కే ఎల్ రాహుల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్. సూర్య‌కుమార్ యాద‌వ్‌, దీప‌క్ చాహ‌ర్ లు గాయాల కార‌ణంగా దూరం అయ్యారు. అయిన‌ప్ప‌టికి భార‌త్ ఫేవ‌రేట్‌గానే బ‌రిలోకి దిగుతోంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ దిశ‌గా యువ ఆట‌గాళ్లను ప‌రీక్షించ‌డానికి ఈ సిరీస్ భార‌త్‌కు మ‌రో అవ‌కాశం. శ్రేయాస్ అయ్య‌ర్‌, రుతురాజ్ గైక్వాడ్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్‌ల‌తో పాటు చాలా కాలం త‌రువాత జ‌ట్టులోకి వ‌చ్చిన సంజూ శాంస‌న్ తానేంటో నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. వికెట్ కీప‌ర్‌గా ఇషాన్ కిష‌న్ కూడా అందుబాటులోకి ఉండ‌డంతో తొలి టీ20లో సంజుకు అవ‌కాశం ల‌భిస్తోందో లేదో చూడాలి. గాయంతో జ‌ట్టుకు దూర‌మైన జ‌డేజా, విశ్రాంతి అనంత‌రం బుమ్రాలు జ‌ట్టుతో చేర‌డం భార‌త్‌కు లాభించే అంశం. జ‌డేజా రావ‌డంతో ర‌వి బిష్ణోయ్‌ని కొన‌సాగిస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్.. రుతురాజ్‌తో క‌లిసి ఓపెనింగ్ చేసే అవ‌కాశం ఉంది.

Next Story