హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా బ్యాటర్లలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. మరొక రోజు మిగిలి ఉండగానే తొలి టెస్టు పూర్తయింది. భారత్‌పై ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ టీమ్‌లో టామ్ హార్ట్‌లే ఏకంగా 7 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఎక్కడ తప్పు జరిగిందో నిర్ధారించడం కష్టమని అన్నారు. 190 పరుగుల ఆధిక్యం లభించడంతో బ్యాటింగ్‌లో బాగానే రాణించామని అనుకున్నామనీ.. ఓలీ పోప్ అసాధారణమైన బ్యాటింగ్ చేశాడని రోహిత్ శర్మ తెలిపారు. భారత పరిస్థితులలో విదేశీ బ్యాటర్లు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇదొకటని రోహిత్ మెచ్చుకున్నాడు. మొత్తంగా ఒక జట్టుగా మేము విఫలమయ్యాం.. రెండో ఇన్నింగ్స్‌లో తగిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేదన్నాడు రోహిత్. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చాలా బాగా పోరాడారని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తెలిపాడు.