చాలా టాలెంట్ ఉంది.. ఓ అవకాశం రావాలి అంతే.. సంజు ఇన్నింగ్స్ తర్వాత రోహిత్..
Rohit Sharma impressed with 'talented' Indian star after 2nd T20 heroics. శనివారం ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం
By Medi Samrat Published on 27 Feb 2022 11:04 AM ISTశనివారం ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రేయాస్ అయ్యర్ (74*) మరోసారి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించగా.. అతనికి సంజు శాంసన్ (39), రవీంద్ర జడేజా (45*) మంచి సహకారం అందించారు. దీంతో టీమిండియా ఇంకా 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
అయితే.. సంజు శాంసన్ చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చాడు. అయితే అతడికి మొదటి టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 18 బంతులు మిగిలివున్నా శాంసన్‌ను కాదని రవీంద్ర జడేజాను నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ను 199/2తో ముగించడంతో పాటు భారీ విజయాన్ని దక్కించుకుంది.
ఇక రెండో టీ20 మ్యాచ్‌లో నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్.. శ్రేయస్‌కు అండగా ఉంటూనే బ్యాట్ ఝుళిపించాడు. పవర్‌ప్లేలో కెప్టెన్ రోహిత్ శర్మ (1), ఇషాన్ కిషన్ (16)లను అవుట్ అవడంతో తొలుత క్రీజులో నిలదొక్కుకోవడానికి యత్నించిన శాంసన్.. ఆ తర్వాత స్వేచ్చగా షాట్లు ఆడాడు. అయితే.. లాహిరు కుమార వేసిన 13వ ఓవర్‌లో శాంసన్ 22 పరుగులు పిండుకున్నాడు. దురదృష్టవాశాత్తు అదే ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. శాంసన్ ఆటతీరును కొనియాడాడు.
"మా బ్యాటింగ్ యూనిట్‌లో చాలా ప్రతిభ ఉంది. మేము వారికి అవకాశాలు ఇస్తూనే ఉంటాము. దానిని ఉపయోగించుకోవడం వారి ఇష్టం. సంజు ఎంత బాగా ఆడగలడో చూపించాడని అనుకుంటున్నాను. అవకాశాలను అందిపుచ్చుకోవడం అంటే ఇదే. టీంలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారి ఆట బయటకి రావాలంటే ఓ అవకాశం కావాలి. చాలా మంది కుర్రాళ్ళు కూడా అవకాశం కోసం వేచి ఉన్నారు.. వారి సమయం కూడా వస్తుంది. మేము కొంతకాలం జట్టులో ఉన్న, చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్లను చూసుకోవాలి. కుర్రాళ్లందరూ చాలా ప్రతిభను కలిగి ఉన్నారని మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి మా వైపు నుండి వారికి అవకాశం, మద్దతు ఇవ్వడం జరుగుతుందని రోహిత్ అన్నాడు.
ఇదిలావుంటే.. శాంసన్ 25 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అయ్యర్‌తో కలిసి మూడవ వికెట్‌కు 84 పరుగుల కీలక బాగస్వామ్యాన్ని జోడించాడు. ఈ భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను గాడినపెట్టింది. శాంసన్ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు.