ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీకి విరాట్ గుడ్‌బై..?

Rohit likely to replace Kohli as Team India's limited overs captain.త్వ‌ర‌లోనే టీమ్ఇండియాలో కీల‌క మార్పులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2021 7:12 AM GMT
ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీకి విరాట్ గుడ్‌బై..?

త్వ‌ర‌లోనే టీమ్ఇండియాలో కీల‌క మార్పులు చోటుచేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. యూఏఈ వేదిక‌గా అక్టోబ‌ర్ 17 నుంచి నవంబరు 14 వ‌ర‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ త‌ప్పుకోనున్నాడు అనే ఓ వార్త ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌లు జాతీయ మీడియాలో ఈ మేర‌కు ప‌లు క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఈ ప్ర‌తిపాద‌న‌ను బీసీసీఐ ముందు ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం కోహ్లీ మూడు ఫార్మాట్ల‌లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇటీవ‌ల ఇది అత‌డి బ్యాటింగ్‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంద‌ని.. అందుకునే కోహ్లీ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు అంటున్నాయి. పరిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌గా కోహ్లీ త‌ప్పుకుంటే.. ప్ర‌స్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌కు ప్ర‌మోష‌న్ ల‌భించ‌నుంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్‌కు తిరుగులేని రికార్డు ఉన్న సంగ‌తి తెలిసిందే. 5 సార్లు ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును ఛాంపియ‌న్‌గా నిల‌బెట్టిన రోహిత్ శ‌ర్మ రికార్డును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని బీసీసీఐ హిట్‌మ్యాన్‌కు కెప్టెన్సీ అప్ప‌గించాల‌ని బావిస్తున్న‌ట్లు స‌మాచారం.

కోహ్లి ఇప్ప‌టి వ‌ర‌కూ 95 వ‌న్డేల్లో సార‌ధిగా వ్య‌వ‌హరించాడు. అందులో 65 విజ‌యాలు, 27 ఓట‌ములు ఉన్నాయి. కెప్టెన్‌గా విజ‌యాల శాతం 70.43 కావ‌డం విశేషం. ఇక అత‌ని కెప్టెన్సీలో 45 టీ20ల్లో 27 గెలిచి, 14 ఓడిపోయింది. ఇక రోహిత్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే 10 వ‌న్డేల్లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించగా.. 8 విజ‌యాలు సాధించాడు. అటు 19 టీ20ల్లో 15 విజ‌యాలు సాధించి పెట్టాడు.

Next Story