పంత్‌కు అనుకోని అవ‌కాశం.. ద‌క్షిణాఫ్రికాతో తొలి టీ20 నేడే.. ఊరిస్తున్న ప్ర‌పంచ రికార్డు

Rishabh Pant to lead Team India against South Africa.సీనియ‌ర్ల గైర్హాజ‌రీలో భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2022 10:50 AM GMT
పంత్‌కు అనుకోని అవ‌కాశం.. ద‌క్షిణాఫ్రికాతో తొలి టీ20 నేడే.. ఊరిస్తున్న ప్ర‌పంచ రికార్డు

సీనియ‌ర్ల గైర్హాజ‌రీలో భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మైంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా నేడు(గురువారం) ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు విశాంత్రి నివ్వ‌గా.. అత‌డి స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. అయితే.. అనుకోకుంగా రాహుల్ గాయంతో దూరం అవ్వ‌డంతో తొలి టీ20లో రిష‌బ్ పంత్ భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించిన అనుభవం ఉన్న పంత్‌.. భార‌త జట్టును ఎలా న‌డిపిస్తాడో చూడాలి.

ఇక భార‌త జ‌ట్టుకు తొలిసారి కెప్టెన్సీ చేప‌ట్ట‌డంపై పంత్ స్పందించాడు. త‌న హోమ్ గ్రౌండ్‌లోనే తొలిసారి ఈ అవ‌కాశం రావ‌డం అదృష్టంగా బావిస్తున్న‌ట్లు తెలిపాడు. దీన్ని స‌ద్వినియోగం చేసుకుంటాన‌ని అన్నాడు. టీ20 లీగ్ త‌రువాత మ‌ళ్లీ కెప్టెన్సీ చేయ‌డం బాగుంద‌ని, ఒకే ప‌నిని ప‌దే ప‌దే చేయ‌డం ద్వారా త‌న నైపుణ్యాలు మెరుగ‌వుతాయ‌ని అన్నాడు. ఎప్పటిక‌ప్పుడు కొత్త విష‌యాలు నేర్చుకుంటాన‌ని చెప్పుకొచ్చాడు. ఈ కెప్టెన్సీ అనుభ‌వం రాబోయే రోజుల్లో త‌న‌కు ప‌నికివ‌స్తుంద‌ని తెలిపాడు.

ఇక‌.. గాయం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు దూర‌మైన రాహుల్ మాట్లాడుతూ.. 'ఈ కఠినమైన వాస్తవాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఈరోజు మరో సవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వదేశంలో జట్టును ముందుండి నడిపించేందుకు వచ్చిన మొట్ట మొదటి అవకాశం చేజారింది. అయితేనేం, మా ఆటగాళ్లకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. రిషభ్‌ పంత్‌ అండ్‌ బాయ్స్‌కు బెస్టాఫ్‌ లక్‌. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాను' అంటూ కేఎల్‌ రాహుల్‌ త ట్వీట్‌ చేశాడు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధిస్తే స‌రికొత్త రికార్డు సృష్టించ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త జ‌ట్టు వ‌రుస‌గా 12 టీ20ల్లో విజ‌యాలు సాధించింది. 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్థాన్‌, న‌మీబియా, స్కాట్లాండ్ జ‌ట్ల‌పై విజ‌యాలు సాధించిన త‌రువాత న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక జ‌ట్ల‌పై వ‌రుస‌గా మూడు సిరీస్‌లు క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వ‌రుస‌గా అత్య‌ధికంగా (12) విజ‌యాలు సాధించి ఆఫ్గానిస్తాన్‌, రోమానియా స‌ర‌స‌న నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే.. అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్టుగా నిల‌వ‌నుంది.

Next Story
Share it