500 నుంచి 501వ వికెట్ తీయడానికి మధ్య అశ్విన్ కుటుంబంలో ఏం జరిగింది.?
రవిచంద్రన్ అశ్విన్ భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
By Medi Samrat Published on 19 Feb 2024 2:33 PM ISTరవిచంద్రన్ అశ్విన్ భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. రాజ్‌కోట్ టెస్టు రెండో రోజు జాక్ క్రౌలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ 500 టెస్ట్ వికెట్లు పూర్తి చేశాడు. ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో కూడా పాల్గొన్నాడు. అయితే ఆ తర్వాత కుటుంబ అత్యవసర కారణంగా ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. తల్లి ఆరోగ్యం బాగోలేక చెన్నై వెళ్లిన అశ్విన్ శనివారం మైదానంలో కనిపించలేదు. అయితే.. అతను ఆదివారం రాజ్‌కోట్‌కు తిరిగి వచ్చి తన 501వ టెస్టు వికెట్‌ను సాధించాడు. దీనిపై అశ్విన్ భార్య ప్రీతి ఈ ఘనతపై ఎమోషనల్ నోట్ రాసింది.
అశ్విన్ కుటుంబ ఎమర్జెన్సీకి కారణమేమిటనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. అశ్విన్ తల్లి ఆరోగ్యం క్షీణిస్తోందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి తీవ్రతను ప్రీతి వ్యక్తం చేసింది. 48 గంటలు తన కుటుంబానికి అత్యంత కష్టతరమైనవని పేర్కొంది.
ప్రీతి ఇన్‌స్టాగ్రామ్‌లో 'మేము హైదరాబాద్‌లో 500 వికెట్ల కోసం ఎదురు చూశాము, కానీ అది జరగలేదు. విశాఖపట్నంలో కూడా వెయిట్ చేశాను, కానీ మిస్సయ్యాడు. 499 వికెట్ పడినప్పుడు ఇంట్లో అందరికీ పంచాను. 500 వికెట్లు సాధించినందుకు ప్రత్యేక వేడుకలు లేవు. ఏమీ జరగనట్లుగా నిశ్శబ్దంగా గడిచిపోయింది. 500-501 వికెట్లకు మధ్య చాలా జరిగాయి. అశ్విన్, నువ్వు ఎంత అద్భుతమైన ఆటగాడివి. నువ్వంటే గర్వంగా ఉంది. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం! అని రాసుకొచ్చింది.
ఆదివారం రాజ్‌కోట్‌లో తన సహచరులతో తిరిగి చేరేందుకు అశ్విన్ అందుబాటులో ఉంటాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో ధృవీకరించింది. నాలుగో రోజు టీ టైమ్ తర్వాత అశ్విన్ మైదానంలోకి వచ్చాడు. టామ్ హార్ట్లీని అవుట్ చేయడం ద్వారా అతను తన 501వ వికెట్‌ని సాధించాడు.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే సమయానికి రాజ్‌కోట్ చేరుకోవడానికి అశ్విన్‌కు సహాయం చేసేందుకు BCCI అతనికి చార్టర్డ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసింది. కుటుంబంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నా, నిరంతర ప్రయాణం వల్ల మానసికంగా అలసిపోయినా అశ్విన్ పట్టు వదలకుండా నాలుగో రోజు టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో అశ్విన్ కనిపించనున్నాడు.