ఇంగ్లండ్ టూర్ లో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం..!

Ravi Shastri Tests Positive For Covid. శ్రీలంక టూర్ కు వెళ్లిన యంగ్ జట్టుకు కరోనా సోకడంతో సిరీస్ లో ఎలాంటి మార్పులు

By Medi Samrat  Published on  5 Sept 2021 5:05 PM IST
ఇంగ్లండ్ టూర్ లో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం..!

శ్రీలంక టూర్ కు వెళ్లిన యంగ్ జట్టుకు కరోనా సోకడంతో సిరీస్ లో ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్ లో ఉన్న భారత జట్టులో కూడా కరోనా టెన్షన్ మొదలైంది. హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారినపడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయనను, టీమిండియా కోచింగ్ సిబ్బందిని ఐసోలేషన్ కు తరలించారు. ఐసోలేషన్ కు తరలించిన వారిలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఉన్నారు.

రవిశాస్త్రికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆర్టీ-పీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. ఈ టెస్టు ఫలితం వచ్చేవరకు ఆయనను ఐసోలేషన్ లో ఉంచనున్నారు. టీమిండియా ఆటగాళ్లలో ఎవరూ కరోనా బారినపడలేదని, ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది. రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆటగాళ్లకు, సహాయక సిబ్బంది మొత్తానికి ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. వారందరికీ నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌, ఫిజియో నితిన్‌ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ నుంచి తదుపరి సమాచారం అందేవరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటారని జై షా పేర్కొన్నారు.


Next Story