భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లో 7పోర్లు, 1సిక్స్ సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీతో కలిసి కేవలం 48 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ ఆటతీరుపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లల్లోనూ సూర్య కుమార్ యాదవ్ కు రాణించే సత్తా ఉందని అన్నాడు. "సూర్య 3 ఫార్మాట్ల ఆటగాడు. టెస్టు క్రికెట్‌లో అతడి అరగ్రేటం గురించి ఎవరూ మాట్లాడరు. అయినప్పటికీ సూర్య టెస్టుల్లో అద్భుతంగా ఆడగలడని నేను భావిస్తున్నా. అతడిని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించండి. చాలా మందిని ఆశ్చర్యపరుస్తాడు." అని రవిశాస్త్రి అన్నాడు.
దీనిపై సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. "నా తొలి మ్యాచ్‌కు ముందు శాస్త్రి నన్ను పిలిచారు. వెళ్లు.. బిందాస్‌గా ఆడు అంటూ ప్రోత్సహించారు. ఆ మాటలు నాకింకా గుర్తున్నాయి "అని అన్నాడు.