'వసీం అక్రమ్ కంటే అత‌డే గొప్ప ఆట‌గాడు'.. పాక్‌ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్‌

వసీం అక్రమ్‌కు ఆల్ టైమ్ గ్రేట్‌ బౌలర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ పాకిస్థాన్ బౌలర్‌ను సుల్తాన్ ఆఫ్ స్వింగ్ అని పిలుస్తారు.

By Medi Samrat  Published on  16 Feb 2025 2:54 PM IST
వసీం అక్రమ్ కంటే అత‌డే గొప్ప ఆట‌గాడు.. పాక్‌ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్‌

వసీం అక్రమ్‌కు ఆల్ టైమ్ గ్రేట్‌ బౌలర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ పాకిస్థాన్ బౌలర్‌ను సుల్తాన్ ఆఫ్ స్వింగ్ అని పిలుస్తారు. నేటికీ అక్రమ్ పేరునే ఉదాహరణగా తీసుకుంటారు. నేటి ఆటగాళ్లు అక్రమ్ స్థాయికి చేరుకోవడం పెద్ద విషయం. అయితే అక్రమ్ కంటే ఒక యువ‌ ఆటగాడు గొప్పవాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు. అయితే ఆ యువ‌ ఆటగాడు పాకిస్థాన్‌కు చెందినవాడు కాదు.

ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. వ‌సీం అక్రమ్ కంటే పెద్ద ఆటగాడని లతీఫ్ అభివర్ణించాడు. రషీద్ తన స్పిన్‌తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. 26 ఏళ్ల వయసులోనే బ్యాట్స్‌మెన్‌లో భయం నింపాడు. ఐపీఎల్‌లో ఆడుతూ వెలుగులోకి వచ్చిన రషీద్ అక్కడి నుంచి ఎక్క‌డికో వెళ్లిపోయాడు అని పేర్కొన్నాడు.

తన ప్రకటన వెనుక ఉన్న కారణాన్ని తెలియజేస్తూ.. రషీద్ ప్రపంచ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు గుర్తింపు తెచ్చాడు. జియో న్యూస్ షోలో లతీఫ్ మాట్లాడుతూ.. “రషీద్ ఆఫ్ఘనిస్తాన్‌ను మ్యాప్‌లో ఉంచాడు. అతను ఆఫ్ఘనిస్తాన్‌కు గుర్తింపు రావ‌డంలో సహాయం చేశాడు. అతను వసీం అక్రమ్ కంటే కూడా గొప్పవాడు. నన్ను క్షమించండి.. కానీ రషీద్.. అక్రమ్ కంటే పెద్ద ఆట‌గాడు అని పేర్కొన్నాడు. "నేను రషీద్‌కి ఒకే ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీ టెస్ట్ జట్టును మెరుగుపరచండి. పాకిస్తాన్‌తో వీలైనన్ని ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడండి" అని చెప్పాడు.

రషీద్ తన దేశం తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడి మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. 111 వన్డేల్లో 198 వికెట్లు తీశాడు. రషీద్ 96 టీ20 మ్యాచ్‌లు ఆడి 161 వికెట్లు తీశాడు. టీ20 విషయానికి వస్తే.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో రషీద్ సంచలనం సృష్టించాడు. టీ20 మ్యాచుల్లో మొత్తం 462 మ్యాచ్‌లు ఆడి 634 వికెట్లు పడగొట్టాడు.

అక్రమ్ విషయానికి వస్తే 104 టెస్టు మ్యాచ్‌ల్లో 414 వికెట్లు తీశాడు. 356 వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. అక్రమ్ రిటైరయ్యే నాటికి అంతర్జాతీయ స్థాయిలో టీ20 క్రికెట్ ప్రారంభం కాలేదు. అయితే ఇంగ్లండ్‌లో కొన్ని టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఐదు టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

Next Story