రిటైర్మెంట్ ప్రకటించిన 'ది గ్రేట్ రాణి రాంపాల్'
భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ రిటైర్మెంట్ ప్రకటించింది.
By Medi Samrat Published on 24 Oct 2024 9:30 PM ISTభారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ రిటైర్మెంట్ ప్రకటించింది. 16 ఏళ్ల హాకీ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించడమే తన కల అని కోచ్‌గా కూడా సేవలందిస్తున్న రాణి రాంపాల్ వెల్లడించింది. రాణి కెప్టెన్సీలో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ నాల్గవ స్థానాన్ని సాధించింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత మహిళల హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం.
రాణి రాంపాల్ ప్రయాణం 14 ఏళ్ల వయసులో మొదలైంది. 2008లో రష్యాలోని కజాన్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత మహిళల హాకీ జట్టు తరఫున ఆమె రంగంలోకి దిగింది. 15 సంవత్సరాల వయస్సులో ఆమె 2010 ప్రపంచ కప్‌లో పాల్గొంది. అక్కడ ఆమె 7 గోల్స్ చేసింది. దీంతో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో నిలిచింది.
మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో భారత్, జర్మనీ పురుషుల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం రాణి రాంపాల్ రిటైర్మెంట్ ప్రకటించింది. రాణి గౌరవార్థం ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో హాకీ ఇండియా ఆమెను 10 లక్షల రూపాయల నగదు బహుమతితో సత్కరించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాదాపు 15 ఏళ్ల పాటు భారత జెర్సీని ధరించి.. ఇప్పుడు మైదానం వీడి కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. హాకీ నా అభిరుచి, నా జీవితం, హాకీ ఆడటం గొప్ప గౌరవం. చిన్న ఆరంభం నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం వరకూ అద్భుతమైన ప్రయాణం అని పేర్కొంది.
రాణి కెప్టెన్సీలో 13 ఏళ్ల తర్వాత 2017లో భారత్ మహిళల ఆసియా కప్‌ను గెలుచుకుంది. FIH ఫిమేల్ యంగ్ ప్లేయర్ అవార్డుకు నామినేట్ అయిన మొదటి భారతీయ మహిళా హాకీ క్రీడాకారిణి కూడా ఆమె. రాణి తన కెరీర్‌లో 2016లో అర్జున అవార్డు, 2019లో వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్, 2020లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ వంటి అనేక అవార్డులను గెలుచుకుంది.