తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తు.. రాజస్థాన్ ఘన విజయం
Rajasthan Royals kick-off season with commanding win over Sunrisers Hyderabad.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022
By తోట వంశీ కుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఓ పక్క విభాగంలోనూ ఆకట్టుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్థశతకంతో చెలరేగా.. దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెట్‌మైర్ (13 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సమయోచితంగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
భారీ లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులే పరిమితమైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (2), నికోలస్ పూరన్ (0), రాహుల్ త్రిపాఠి(0), అభిషేక్ వర్మ (9), అబ్దుల్ సమద్ (4) లు దారుణంగా విఫలం కావడంతో సన్ రైజర్స్ 37 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం సగటు అభిమానిలో కలిగింది. మార్‌క్రమ్ (41 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (14 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) లు ఓ మోస్తారుగా రాణించడంతో సన్ రైజర్స్ కనీసం ఆ స్కోరైనా చేసింది. లేదంటే భారీ తేడాతో ఓటమి పాలు అయ్యేది. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ మూడు, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.