ఒకానొక దశలో టాప్ లో కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తరువాత దారుణమైన ఆటతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక ఆఖరి మ్యాచ్ లో వర్షం రావడంతో రాజస్థాన్ జట్టు మూడో స్థానంలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఆదివారం నాడు రాజస్థాన్ కలకత్తాతో తలపడాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. గత మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్ తమ పేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లించడమే కాకుండా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం విజయం సాధించడంతో మూడవ స్థానానికి పరిమితమైంది.
కోల్ కతా ఈ సీజన్ లో తొమ్మిది విజయాలు, మరో రెండు పాయింట్లతో 20 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలవగా.. మెరుగైన నికర రన్ రేట్ (NRR) కారణంగా SRH (17 పాయింట్లు) రాజస్థాన్ (17 పాయింట్లు)ను అధిగమించింది. రాజస్థాన్ కు నెట్ రన్ రేట్ 0.273 ఉండగా.. సన్ రైజర్స్ 0.414 NRRతో రెండో స్థానానికి చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగే తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో KKR ఆడుతుంది. ఆ తర్వాత అదే వేదికపై రాజస్థాన్ రాయల్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ‘ఎలిమినేటర్’ జరగనుంది.