ఇంత మంచితనమా.? రూ. 2.5 కోట్ల అదనపు బోనస్‌ను తిరస్కరించిన ద్రవిడ్..!
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ దాతృత్వం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 July 2024 10:35 AM GMTటీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ దాతృత్వం వెలుగులోకి వచ్చింది. తన మిగిలిన సహాయక సిబ్బందితో సమానంగా అవార్డు బోనస్‌లు తీసుకోవాలనే అతని సూత్రాలకు అనుగుణంగా.. అవుట్‌గోయింగ్ హెడ్ కోచ్ అదనంగా రూ. 2.5 కోట్లు తీసుకోవడానికి నిరాకరించాడు. ద్రవిడ్ T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని ప్లేయింగ్ స్క్వాడ్ సభ్యులతో సమానంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) నుండి అవార్డు బోనస్‌ను అందుకోవాల్సి ఉంది. అయితే.. అతడు నిరాకరించాడు. అతని మిగిలిన కోచింగ్ స్టాఫ్ తీసుకున్న మొత్తాన్నే ద్రవిడ్ కూడా తీసుకున్నాడు.
రాహుల్ తన సహాయక సిబ్బంది (బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్) వలె బోనస్ మొత్తాన్ని (రూ. 2.5 కోట్లు) కోరుకున్నాడు. ఆయన మనోభావాలను గౌరవిస్తామని బీసీసీఐలోని కీలక వ్యక్తి తెలిపారు. విజేతగా నిలిచిన జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్లు బహుమతిగా ఇచ్చింది. బోర్డు రూపొందించిన పంపిణీ ఫార్ములా ప్రకారం.. భారత విజేత జట్టులోని 15 మంది సభ్యులతో సహా ద్రవిడ్ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీలో రూ. 5 కోట్లు పొందాలి. సహాయక సిబ్బంది, సెలెక్టర్లు, రిజర్వ్ టీమ్ సభ్యులు ఒక్కొక్కరూ రూ. 2.5 కోట్లు ప్రైజ్ మనీ పొందుతారు. అయితే అదనంగా వచ్చే రూ.2.5 కోట్లు తీసుకోవడానికి నిరాకరించిన ద్రవిడ్.. మిగతా సపోర్టు స్టాఫ్ లాగా రూ.2.5 కోట్లు మాత్రమే తీసుకున్నాడు.
ద్రవిడ్ అవార్డు బోనస్‌లో కోత విధించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2018లో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా ఇలానే చేశాడు. ద్రవిడ్ అప్పుడు అండర్-19 జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ద్రావిడ్ స్థాయికి రూ.50 లక్షలు, సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యులకు రూ.20 లక్షలు, ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.30 లక్షలు ఇవ్వాలని నిర్ణయించగా.. ద్రవిడ్ ఆ ఫార్ములాను అంగీకరించడానికి నిరాకరించాడు. బీసీసీఐ అందరికీ సమాన అవార్డులు ఇవ్వాలని ద్రవిడ్ కోరుకున్నాడు. దీంతో ద్రవిడ్ సహా కోచింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇచ్చారు. అలాంటి లక్షణాలతో ద్రవిడ్ తన పదవీ కాలంలో చాలా నిలకడగా ఉన్నాడు. ఈ కారణంగానే మిగిలిన కోచింగ్ స్టాఫ్‌తో అతని స్నేహబంధం చాలా ధృడంగా ఉంటుంది.
ఆటగాడిగా ఎన్ని విజయాలు సాధించినా.. ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడుగా లేని ద్రవిడ్.. చివరకు భారత టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆ ఘనతను సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి సీనియర్ విరాట్ కోహ్లి వరకు ద్రవిడ్‌ను విజయోత్సవ సంబరాల్లోకి ముంచెత్తారు. గత ఏడాది ODI ప్రపంచ కప్ తర్వాత ద్రవిడ్ వైదొలగాలని నిర్ణయించుకున్నాడు, అయితే రోహిత్ అతన్ని టీ20 టోర్నమెంట్ వరకూ ఉండమని ఒప్పించాడు. ఈ కారణంగానే రోహిత్‌కి ద్రవిడ్ కృతజ్ఞతలు తెలిపాడు.