మ‌ళ్లీ హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!

ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా గెలుచుకుంది.

By Medi Samrat  Published on  6 Sept 2024 6:38 PM IST
మ‌ళ్లీ హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!

ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా గెలుచుకుంది. ఆ త‌ర్వాత‌ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌లోకి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టు ద్రావిడ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్‌ శుక్రవారం ప్రకటించింది.

రాహుల్ ద్రవిడ్ పింక్ జెర్సీతో ఉన్న ఫోటోను రాజస్థాన్ రాయల్స్ X ఖాతాలో షేర్ చేసింది. భారత దిగ్గజ ప్రపంచ కప్ విన్నింగ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా ద్రవిడ్‌కు రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ సీఈఓ జేక్ లష్ మెక్‌క్రం పింక్ జెర్సీని బహుకరించారు. "ప్రపంచ కప్ తర్వాత నేను మరొక సవాలును స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైందని.. దానిని పూర్తిచేయ‌డానికి రాజ‌స్థాన్‌ రాయల్స్ సరైన జ‌ట్టు" అని ద్రవిడ్ చెప్పాడు.

దీంతో రాహుల్ ద్రవిడ్ తన పాత ఫ్రాంచైజీకి తిరిగి వచ్చాడు. ద్రవిడ్ ఐపీఎల్ 2012, 2013లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇది కాకుండా అతను 2014, 2015 సీజన్లలో జట్టుకు డైరెక్టర్, మెంటార్‌గా కూడా ఉన్నాడు. ఐపీఎల్ 2016లో ద్రవిడ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మారాడు. 2019లో అతనికి నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా బాధ్యతలు అప్పగించారు. దీని తర్వాత 2021 సంవత్సరంలో ద్ర‌విడ్‌ టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.

Next Story