ఆ రోజు ధోనీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది

R Sridhar recalls MS Dhoni's decision that did wonders for Indian cricket.క్రికెట్‌లో ప్ర‌యోగాలు స‌హ‌జం. ప్ర‌యోగాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2022 12:55 PM IST
ఆ రోజు ధోనీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది

క్రికెట్‌లో ప్ర‌యోగాలు స‌హ‌జం. ప్ర‌యోగాలు స‌క్సెస్ అయి జ‌ట్టు విజ‌యం సాధిస్తే ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌రు కానీ ఒక వేళ విఫ‌లం అయితే విమ‌ర్శ‌ల జ‌డివాన ఎదుర్కొన‌క త‌ప్ప‌దు. అందుక‌నే కొంద‌రు కెప్టెన్లులు ప్ర‌యోగాలు చేసేందుకు వెన‌క‌డుగు వేస్తుంటారు. అయితే.. ఆట‌గాళ్ల‌పై న‌మ్మ‌కముంచే ధోని చేసిన ఓప్ర‌యోగం టీమ్ఇండియాకు ఓస్టార్ బ్యాట్స్‌మెన్‌ను అందించడంతో పాటు ఇప్పుడు కెప్టెన్‌ను చేసింది. అత‌డే రోహిత్ శ‌ర్మ‌. కెరీర్ ప్రారంభంలో రోహిత్ శ‌ర్మ మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడే వాడు. అయితే.. 2013 చాంపియ‌న్స్ ట్రోఫీ సంద‌ర్భంగా రోహిత్‌ను ధోని ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దించాడు. దీంతో రోహిత్ ద‌శ తిరిగిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ఫామ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్‌ను కాద‌ని ధోనీ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధ‌ర్ గుర్తు చేసుకున్నాడు.

వెస్టిండీస్ సిరీస్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌ను రోహిత్ ఓపెన‌ర్‌గా ప్ర‌మోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి రెండు మ్యాచుల్లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ సూర్య మూడో మ్యాచ్‌లో త‌న‌దైన షాట్ల‌తో విరుచుకుప‌డి మ్యాచ్‌ను ఏక ప‌క్షం చేసేశాడు. సూర్య కుమార్ ఓపెనింగ్ పై స్పందిస్తూ శ్రీధ‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. "2013 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రాక్టీస్ గేమ్‌లో దినేశ్ కార్తీక్ అదరగొట్టినా.. అతను రోహిత్‌ను టాపార్డర్‌లో ఆడించాడు. మేనేజ్‌మెంట్‌ నిర్ణయాల్లో అతని నిర్ణయాలే కీలకమయ్యేవి. అయితే ధోనీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది" అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు.

రెండేళ్ల క్రిత‌మే సూర్య కుమార్‌ను జ‌ట్టులోకి తీసుకోవాల‌ని బావించినా విరాట్‌కోహ్లీ, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల కార‌ణంగా అది కుద‌ర‌లేద‌న్నాడు. కోహ్లీ గైర్హాజరీలో శ్రేయస్ ఆడేవాడని, దాంతో సూర్యకు అవకాశం లేకుండా పోయిందన్నాడు. ఏదేమైనా అతను జట్టులోకి రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

Next Story