ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో అశ్విన్ నయా రికార్డ్
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 24 Oct 2024 10:19 AM GMTపూణెలోని ఎంసీఏ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున ఆరు వికెట్లు పడగా.. మూడు వికెట్లు రవి అశ్విన్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు తీసి అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ రెండో వికెట్ తీయగానే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతను ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియోన్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఐసీసీ 2019 సంవత్సరంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం రెండవ సీజన్ జరుగుతుంది. భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం 39 ఇన్నింగ్సుల్లో 188 వికెట్లు దీసి చరిత్ర సృష్టించాడు. ఇందులో 11 సార్లు ఐదు వికెట్లు తీశాడు. నాథన్ లియాన్ 43 ఇన్నింగ్సుల్లో 187 వికెట్లు పడగొట్టాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియాన్ రెండవ స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (175 వికెట్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ (147 వికెట్లు), ఐదో స్థానంలో 134 వికెట్లతో ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు.
బెంగళూరు టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్ పట్టికలో టీమ్ ఇండియా కొంత పతనాన్ని చవిచూసింది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు టీమ్ ఇండియా రెండవ టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయడానికి ప్రయత్నించడమే కాకుండా WTC పాయింట్ల పట్టికలో మెరుగవడానికి కూడా ప్రయత్నిస్తుంది.