టార్గెట్ టీమిండియా.. దూసుకొస్తున్న పృథ్వీ షా..!
టీమ్ ఇండియాకు దూరమైన పృథ్వీ షా.. దేశవాళీ క్రికెట్‌లో బుచ్చిబాబు టోర్నీలో భీకరంగా గర్జిస్తున్నాడు.
By Medi Samrat
టీమ్ ఇండియాకు దూరమైన పృథ్వీ షా.. దేశవాళీ క్రికెట్‌లో బుచ్చిబాబు టోర్నీలో భీకరంగా గర్జిస్తున్నాడు. ఈ టోర్నీలో పృథ్వీ ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్స్‌లు ఆడగా.. అందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. మంచి విషయమేమిటంటే.. పృథ్వీ మునపటి ఫామ్‌లోకి తిరిగి రావడానికి గట్టి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
తమిళనాడులో జరుగుతున్న ఈ టోర్నీలో TNCA ప్రెసిడెంట్స్ XIతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ 96 బంతుల్లో 66 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. పృథ్వీ ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ డ్రా అయింది. మహారాష్ట్ర తరపున ఆడిన తర్వాత పృథ్వీ షా టోర్నీలో ఒకప్పటి ఫామ్‌ను చూపించాడు. ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో కష్టతరమైన పిచ్‌పై 111 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టోర్నీని ప్రారంభించాడు. ఈ ఇచ్‌పై జట్టులోని మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు అంతా కలిసి 92 పరుగులు మాత్రమే చేయగలిగారు. తదుపరి మ్యాచ్‌లో 1 పరుగు మాత్రమే చేశాడు. ఆ తర్వాత షా TNCA ప్రెసిడెంట్స్ XIతో మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి 47 పరుగులు(57 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచాడు. మరుసటి రోజు మూడు పరుగులు చేసి తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. దీని తర్వాత అతడు హర్షల్ కేట్‌తో కలిసి 94 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే షా 96 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
గత దేశీయ సీజన్ పృథ్వీ షాకు చాలా నిరాశ కలిగించింది. అతను బ్యాట్‌తో పరుగులు చేయలేకపోయాడు. అలాగే, ఫిట్‌నెస్, క్రమశిక్షణ సంబంధిత సమస్యల కారణంగా అతన్ని ముంబై జట్టు నుండి తొలగించాల్సి వచ్చింది. దీంతో IPL 2025 మెగా వేలంలో ఏ ప్రాంఛైజీ తనను కొనలేదు. ఆ తర్వాత అతని సమస్యలు పెరిగాయి. ఇప్పుడు పునరాగమనం కోసం చూస్తున్నాడు.