స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధానతో తనకు సహజమైన అవగాహన ఉందని, దాని కారణంగా మేము భారత్‌కు స్థిరమైన శుభారంభాలను అందించడంలో విజయం సాధించాయని టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ప్రతీకా రావల్ పేర్కొంది. మంధాన అంతర్ముఖి.. నేనూ తనలాగే.. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అదనపు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని ప్రతీక రావల్ చెప్పింది. మేము ఇప్పటికే ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నామని పేర్కొంది.
ఢిల్లీ క్రీడాకారిణి ప్రతీక రావల్ గతేడాది డిసెంబర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసి, తక్కువ వ్యవధిలోనే టాపార్డర్‌లో నిలకడగా రాణిస్తున్న అగ్ర బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో మంధానతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ప్రతీక.. రెండో మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించింది. ఈ రెండో మ్యాచ్‌లో భారత్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత జట్టులో చేరినప్పటి నుండి ఆరు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించిన ప్రతీక.. మంధానకు, నాకు మధ్య అవగాహన చాలా సులభంగా, సహజంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.. ఇన్నింగ్స్‌ల మధ్య మేము ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మంధాన తనకు ఏది ఉత్తమమో అదే చేస్తుంది.. నేను ఏది ఉత్తమమో అదే చేస్తాను. కృత్రిమంగా కాకుండా సహజంగా అనిపించే అవగాహన మా మధ్య ఉంది. మంధానతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని తాను ఆస్వాదిస్తున్నానని, ఇద్దరం బంతి బంతికి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తామని ప్రతీక తెలిపింది. ఆడుతున్నప్పుడు, మా దృష్టి తదుపరి బంతిపై మాత్రమే ఉంటుంది. మంధాన ఆడిన తీరు చాలా స్ఫూర్తినిస్తుందని కొనియాడింది.