పాకిస్తాన్ ఓటమిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్..!

PM Imran Khan praises Pakistan after semi-finals defeat. ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో ఆసీస్ అద్భుతమైన విజయం అందుకుంది.

By Medi Samrat  Published on  12 Nov 2021 7:17 AM GMT
పాకిస్తాన్ ఓటమిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్..!

ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో ఆసీస్ అద్భుతమైన విజయం అందుకుంది. షాహీన్ షా అఫ్రీదికి 19వ ఓవర్లో ఆసీస్ కీపర్ బ్యాట్స్మెన్ మాథ్యూ వేడ్ చుక్కలు చూపించి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. పాక్ విసిరిన 177 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 19 ఓవర్లలోనే ఛేదించారు. మాథ్యూ వేడ్ కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. ఆసీస్ జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ మెరుపు ఇన్నింగ్స్ తో మరో ఓవర్ మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. ఆసీస్ విజయానికి 2 ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా, షహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వేడ్ చితక్కొట్టాడు. హ్యాట్రిక్ సిక్సులతో పాక్ కు విజయాన్ని దూరం చేశాడు. వేడ్, స్టొయినిస్ దూకుడుగా ఆడడంతో చివరి 5 ఓవర్లలో ఆసీస్ 62 పరుగులు సాధించింది. ఈ నెల 14న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది.

పాకిస్తాన్ వరుస విజయాలను చూసిన పాక్ అభిమానులు ఈ ఓటమితో తీవ్ర నిరాశకు గురయ్యారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ క్రికెట్ జట్టుకు ప్రత్యేక సందేశం పంపారు. "నేను క్రికెటర్ గా ఉన్నప్పుడు ఇలాంటి తీవ్ర నిరాశామయ పరిస్థితులను మైదానంలో ఎన్నో ఎదుర్కొన్నాను. ఇప్పుడు మీరు ఎలాంటి వేదనాభరిత పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోగలను. అయితే ఈ టోర్నీలో మీరు ప్రదర్శించిన నాణ్యమైన క్రికెట్ పట్ల గర్వించాలి. విజయాల పట్ల మీరు పొంగిపోకుండా ఒదిగి ఉన్న తీరు అభినందనీయం" అని చెప్పుకొచ్చారు.

ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ఓటమికి క్యాచ్ మిస్ అవ్వడం మాత్రమే కారణం కాదని అన్నాడు. ఎవరు.. ఎవరి మీదా వేలెత్తి చూపరాదని జట్టు సభ్యులకు సూచించాడు. ఈ ఒక్క ఓటమితోనే ఏమీ అయిపోలేదని, టోర్నమెంట్ లో మంచి ఆట ఆడామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు. ఓటమితో బాధ కలగడం సహజమని, కానీ, ఎక్కడ పొరపాట్లు చేశామో జట్టు సభ్యులుగా అందరికీ తెలుసని, వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకు పోవాలని చెప్పాడు. ఓ జట్టుగా ఆడాం కాబట్టే.. ఇక్కడిదాకా వచ్చామని, నీ ఆట బాగాలేదు.. వాడు బాగా ఆడలేదు' అంటూ ఎవరిపైనా వేలెత్తి చూపొద్దన్నాడు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న జట్టు ఐక్యతను.. ఈ ఒక్క ఓటమితో దెబ్బ తీయకూడదని సహచరులకు సూచించాడు.


Next Story