అండర్-19 ఆటగాళ్లపై కోపం.. ఐసీసీకి ఫిర్యాదు చేస్తుందట పాకిస్థాన్
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది.
By - Medi Samrat |
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. అయితే, భారత ప్లేయర్లు నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారని, వారిపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మోహ్‌సిన్ నఖ్వీ చెప్పారు. ఐసీసీ రూల్స్ ప్రకారం రాజకీయాలకు క్రికెటర్లు దూరంగా ఉండాలని, కానీ భారత ఆటగాళ్లు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలో కూడా తమ ఆటగాళ్లను తరుచూ రెచ్చగొట్టారని తెలిపారు. భారత ఆటగాళ్లపై అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇక మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా రన్నరప్ మెడల్స్ స్వీకరించేందుకు భారత అండర్-19 జట్టు ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో ఐసీసీ అసోసియేట్ డైరెక్టర్ ముబష్శిర్ ఉస్మానీ చేతుల మీదుగా భారత ఆటగాళ్లు మెడల్స్ అందుకున్నారు.
డిసెంబర్ 21 ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా భారత U-19 జట్టు అనుచితంగా ప్రవర్తించిందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆరోపించారు. పాకిస్తాన్ బౌలర్ భారత కెప్టెన్‌ను ప్రారంభంలోనే అవుట్ చేసిన తర్వాత అలీ రజా- ఆయుష్ మాత్రే మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో పేసర్‌పై విరుచుకుపడ్డాడు. ఫైనల్‌ను 191 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్ తమ రెండవ U-19 ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.