ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు షాక్‌.. వ‌న్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి పాక్‌

ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.

By Medi Samrat  Published on  27 Aug 2023 2:45 PM IST
ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు షాక్‌.. వ‌న్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి పాక్‌

ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. రెండు పెద్ద టోర్నీలకు ముందు పాకిస్థాన్ సాధించిన ఈ ఘనత ఆటగాళ్లకు మ‌రింత ఉత్సాహాన్ని ఇవ్వ‌నుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న పాకిస్థాన్.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మే నెలలో కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో పాక్‌ జట్టు అగ్రస్థానంలో ఉంది.

ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను.. తొలి వన్డేలో పాక్‌ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో గేమ్ ఉత్కంఠభరితంగా సాగింది.. మ్యాచ్ చివరి ఓవర్‌లో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లోని మూడవ మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.

గత ఏడాది కాలంగా వన్డే ఫార్మాట్‌లో పాకిస్థాన్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 2022 సీజన్‌లో పాక్ వెస్టిండీస్‌ను స్వదేశంలో, నెదర్లాండ్స్‌ను ఓడించారు. జనవరి 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఏప్రిల్‌లో కూడా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ 4–1తో విజయం సాధించింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌పై 3-0తో సిరీస్‌ను గెలుచుకోవడంతో ఈ జట్టు వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.

ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా 118 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 115.8 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు పాకిస్థాన్ 118.48 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా పాయింట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఈ జట్టు రెండో స్థానంలో ఉంది. భారత జట్టు 113 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ప‌లు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో మార్పు వచ్చే అవకాశం ఉంది.

Next Story