బ్యాడ్ ఫీల్డింగ్‌లో వారే టాప్.. పాక్ పరిస్థితి అధ్వాన్నం..!
పాకిస్థాన్ ఫీల్డింగ్‌ను ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్.
By Medi Samrat
పాకిస్థాన్ ఫీల్డింగ్‌ను ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్. మైదానంలో పాక్ ఆటగాళ్లు కూడా తమ వింత వింత విన్యాసాలతో జట్టును ఇబ్బంది పెడుతున్నారు. జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో పేలవమైన ఫీల్డింగ్ కారణంగా గత మంగళవారం షార్జాలో ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ ఓటమిని ఎదుర్కొంది.
అవుట్‌ఫీల్డ్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో మంగళవారం షార్జాలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పాకిస్తాన్ 18 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. క్రిక్‌బజ్ ప్రకారం.. 2024 ప్రారంభం నుండి పాకిస్తాన్ 48 క్యాచ్‌లను వదులుకుంది. 98 రనౌట్‌లను కోల్పోయింది. 89 సార్లు మిస్ ఫీల్డ్ చేసింది.
2024 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 41 జట్లలో బ్యాడ్ ఫీల్డింగ్ పరంగా పాక్ రెండో స్థానంలో ఉంది. మిస్ ఫీల్డింగ్ పరంగా వెస్టిండీస్ (90) అగ్రస్థానంలో ఉంది. ఈ కాలంలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత పాకిస్థాన్‌దే కావడం గమనార్హం. వారి క్యాచింగ్ సామర్థ్యం 81.4 శాతం.. ఇది 12 అసోసియేట్ సభ్యుల జట్లలో ఐర్లాండ్‌తో కలిసి 8వ స్థానంలో ఉంది.
ఇటీవల ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్.. పాకిస్తాన్ ఫీల్డింగ్ గురించి ప్రశ్న అడిగిన జర్నలిస్టును లక్ష్యంగా చేసుకున్నాడు. జట్టు ఎలాంటి తప్పు చేయలేదని రవూఫ్ చెప్పాడు. మ్యాచ్‌లోని విశేషాలను మరోసారి చూడాలని జర్నలిస్టును కోరాడు.
ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ తొలి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్‌ను 9 వికెట్లకు 151 పరుగులకే పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్థాన్ తరఫున ఇబ్రహీం జద్రాన్ 45 బంతుల్లో 65 పరుగులు, సెడిఖుల్లా అటల్ 64 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 169/5 స్కోరు చేసింది. పాక్ ఫాస్ట్ బౌలర్ ఫహీమ్ అష్రఫ్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.