ఇలా అయితే కష్టం సంజూ.. 18, 20, 30లు చాలవు
Pakistan Former player Salman Butt gave advice to Sanju Samson.టీమ్ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇప్పటికి కూడా
By తోట వంశీ కుమార్ Published on 1 March 2022 5:45 PM ISTటీమ్ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇప్పటికి కూడా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. దేశవాళీ, ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ జాతీయ జట్టులో అతడి స్థానం ఎప్పుడూ ప్రశ్నార్థకమే. చాలా కాలం క్రితమే టీమ్ ఇండియా తరుపున అరగ్రేటం చేసినా.. పేలవ షాట్లతో వికెట్ పారేసుకుంటూ చోటు కోల్పోతున్నాడు. అతడి తరువాత అరంగ్రేటం చేసిన ఆటగాళ్లు జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకునే పనిలో ఉండగా.. సంజూ మాత్రం వస్తూ పోతూ ఉన్నాడు.
ఈ క్రమంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్న సంజూ.. రెండో టీ20లో 39 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే.. మూడో టీ20లో 18 పరుగులకే ఔటైయ్యాడు. ఈ నేపథ్యంలో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ సూచించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో భట్ మాట్లాడుతూ.. లంకతో సిరీస్‌లో సంజూ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. అయితే.. 18,19, 20 పరుగులు చేస్తే సరిపోదు. అతడిలో చాలా మంచి నైపుణ్యాలు ఉన్నప్పటికీ సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడు భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే రాణించాల్సిందే. అలా జరగాలంటే అతడు తన ఆటతీరును మెరుగుపరచుకోవాలి. అలాగైతేనే టీమ్ఇండియాలో నిలదొక్కుకుంటాడు అని భట్ చెప్పాడు. ఎంతో మంది యువకులు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజూ విశేషంగా రానిస్తే తప్ప టీమ్ఇండియాలో సుస్థిర చోటు దక్కించుకోవడం కష్టమేనని సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు.
2015లో అరగ్రేటం చేసిన సంజు ఇప్పటి వరకు కేవలం 13 టీ20లు, ఒక వన్డేలో మాత్రమే భారత జట్టు తరుపున ఆడాడు. 13 టీ20ల్లో 174, ఒక వన్డేలో 46 పరుగులు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 121 మ్యాచుల్లో 3,068 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు కూడా ఉన్నాయి.