మూడు కొత్త స్టేడియాలు కూడా నిర్మించింది.. పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం కోల్పోతే ఎన్ని వందల కోట్లు నష్టపోతుందంటే..
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాల్సి ఉన్నా.. దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
By Medi Samrat Published on 14 Nov 2024 3:45 PM GMTవచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాల్సి ఉన్నా.. దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు జట్టును పంపేందుకు అనుకూలంగా లేదు. అయితే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో ఆడేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌ను స్పష్టంగా తిరస్కరించింది. టోర్నీ మొత్తం పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని పీసీబీ చీఫ్ అన్నారు. వీటన్నింటి మధ్య, టోర్నమెంట్‌ను వాయిదా వేసినా లేదా వేరే దేశానికి మార్చినా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వాయిదా వేయబడినా లేదా టోర్నమెంట్‌ను వేరే దేశానికి మార్చినట్లయితే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ICC ఆంక్షలను ఎదుర్కొనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇచ్చే నిధులను ఐసీసీ తగ్గించనుంది. హోస్ట్‌గా ఉన్న PCB.. ICC నుండి US$65 మిలియన్లను అందుకోవాల్సి ఉంది. టోర్నమెంట్‌ని మార్చినా లేదా వాయిదా వేసినా.. ఆతిథ్య రుసుముగా 65 మిలియన్ US డాలర్లను (1,820 కోట్ల పాకిస్తాన్ రూపాయలు) పాకిస్తాన్ కోల్పోతుంది.
అంతే కాదు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ ప్రత్యేక సన్నాహాలు చేసింది. పాకిస్థాన్‌లోని 3 స్టేడియాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 3 వేదికలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోట్లాది రూపాయలను వెచ్చించింది. PCB కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాలను అప్‌గ్రేడ్ చేసింది. ఒక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 3 స్టేడియాలను నవీకరించడానికి రూ.1300 కోట్లు ఖర్చు చేసింది. ఈ స్టేడియాలు ఇప్పుడు పూర్తిగా కొత్తవని బోర్డు తెలిపింది.
స్టేడియం కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించినప్పటికీ.. టోర్నమెంట్ నిర్వహించడానికి పాకిస్తాన్‌కు ఇంకా 500 కోట్ల రూపాయలు మిగిలి ఉంటాయి. ఇంత డబ్బుతో టోర్నీని ఘనంగా నిర్వహించవచ్చు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు బృందాన్ని పంపేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని ప్రభుత్వం చెబుతోంది.